హయత్ నగర్, వనస్థలిపురం ఏరియాల్లో దంచికొట్టిన వర్షం.. వరదకు కొట్టుకుపోయిన ఇంటి పునాది

హయత్ నగర్, వనస్థలిపురం ఏరియాల్లో దంచికొట్టిన వర్షం.. వరదకు కొట్టుకుపోయిన ఇంటి పునాది

ఎల్బీనగర్, వెలుగు: వరద ధాటికి ఓ ఇంటి పునాది కొద్దిగా కొట్టుకుపోగా, దాని పక్కనే ఉన్న 11 కేవీ కరెంట్ స్తంభం ఆ భవనంపైకి ఒరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం సాయంత్రం హయత్ నగర్, వనస్థలిపురం ఏరియాలో వర్షం దంచికొట్టింది. వరద ధాటికి పద్మావతి కాలనీలో ఉన్న అండర్​గ్రౌండ్ డ్రైనేజీ పైపు పగిలిపోయింది. ఈ పైపు నుంచి వెల్లువెత్తిన వరదతో అదే కాలనీలో 60 గజాల్లో ఉన్న ఓ ఇంటి పునాది ఒక పక్క కొద్దిగా కొట్టుకుపోయింది.

పునాది బలహీనపడడంతో ఆ భవనం స్వల్పంగా పక్కకు ఒరిగి ప్రమాదకరంగా మారింది. ఈ భవనం పక్కనే ఉన్న 11 కేవీ కరెంట్ స్తంభం కూడా నేల కుంగి, అదే భవనంపైకి ఒరిగింది. విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే సరఫరాను నిలిపివేశారు. కుంగిన స్తంభాన్ని సరిచేశారు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొట్టుకుపోయిన భవనం పునాదిని జాకీలతో సరిచేయవచ్చని స్థానికులు చెబుతున్నారు.