సీజన్​ మొదలైనా.. మేల్కోని సర్కారు

సీజన్​ మొదలైనా.. మేల్కోని సర్కారు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: వానాకాలం సీజన్​ మొదలై రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. సీజన్​ ప్రారంభమైనా రైతుబంధును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. భూసార పరీక్షలను పక్కకు పెట్టేసింది. వార్షిక రుణ ప్రణాళిక ఖరారు కాలేదు.  దీంతో రైతులు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. 

వార్షిక రుణ ప్రణాళిక ఏదీ..

దుక్కి దున్నడం, విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా పెట్టుబడుల కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. గతేడాది వానాకాలం సీజన్​కు సంబంధించి పంట రుణాల లక్ష్యం రూ.1,240.56 కోట్లు కాగా, రూ.911.64 కోట్లు మాత్రమే ఇచ్చారు. 1,14,760 మంది రైతులకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించిన ఆఫీసర్లు 68,856 మందికి మాత్రమే లోన్స్​ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు పంట రుణాల లక్ష్యం ఖరారు కాలేదు. దీంతో జిల్లా రైతాంగానికి బ్యాంకర్లు క్రాప్​ లోన్స్​ ఇవ్వడం ఇంకా ప్రారంభించలేదు. అదను దాటిన తర్వాత వార్షిక ప్రణాళిక ప్రకటించినా పెద్దగా ఉపయోగం ఉండదని రైతులు వాపోతున్నారు. రూ.25వేలు, రూ.50వేల లోపు రుణాలను మాఫీ చేసినా రూ.75వేలు, రూ.లక్షలోపు రుణాలను మాత్రం ఇప్పటి వరకు మాఫీ చేయలేదు. రైతుబంధు కోసం జిల్లాలోని 1.40 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. గతేడాది దాదాపు 1.34 లక్షల మంది రైతులకు రూ.205 కోట్లను గవర్నమెంట్  ఇచ్చింది. రైతుబంధు డబ్బులను వెంటనే ఖాతాల్లో వేయాలని రైతులు కోరుతున్నారు.  

జాడ లేని భూసార పరీక్షలు

భూసార పరీక్షల జాడ లేకుండా పోయింది. ఏప్రిల్, మే నెలల్లో రైతుల పంట భూముల్లో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేయాల్సి ఉన్నా ఈసారి పట్టించుకోలేదు. జిల్లాలో5.50 లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలు సాగవుతున్నాయి. ఇందులో 1.50 లక్షల ఎకరాల్లో ఉద్యాన వన పంటలు సాగవుతున్నాయి. దాదాపు 4 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, అపరాలు సాగవుతున్నాయి.  సీజన్​ ప్రారంభంలో ఏ భూములు ఏఏ పంటలకు అనుకూలంగా ఉంటాయనే విషయంతో పాటు ఎరువులు ఎలా వాడాలనే విషయం భూసార పరీక్షలతో తెలుస్తుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న భూ సార పరీక్షలను చేపట్టకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.