54 లక్షల 56 వేల మందికి ‘రైతుబంధు’

54 లక్షల 56 వేల మందికి ‘రైతుబంధు’

హైదరాబాద్‌‌, వెలుగు:గతేడాది ఖరీఫ్‌‌, రబీలో ‘రైతుబంధు’ విజ్ఞప్తులను ఇప్పుడు పరిగణనలోకి తీసుకోబోమని,  పదో తేదీలోపు డిజిటల్ సంతకాలు చేసిన రైతులకే పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తేల్చిచెప్పారు. సోమవారం  సచివాలయంలో రైతుబంధు, 2021 జనాభా లెక్కల సమీకరణలపై కలెక్టర్లతో జోషి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. “ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు పెట్టుబడి సాయం అందాలి. డేటా సేకరణ వేగవంతం చేయాలి. సీసీఎల్‌‌ఏ వద్ద ఉన్న 54.56 లక్షల పట్టాదారులకు సంబంధించి కోటి40 లక్షల  ఎకరాల భూమి వివరాలు సేకరించాలి. ఇ-–కుబేర్ సాఫ్ట్‌‌వేర్‌‌ ద్వారా  రైతుల ఖాతాలకు నిధులు జమ చేస్తున్నాం. రైతుల బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ, పోర్టల్ లో అప్ లోడ్ వేగవంతం చేయాలి. ఏఈవోలకు  రైతులు తమ బ్యాంకు అకౌంట్ల వివరాలు ఇవ్వాలని విస్తృతంగా ప్రచారం చేయాలి.  అటవీ భూముల  పట్టాలు,  చనిపోయిన వారికి సంబంధించి వివరాలను  గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ నుంచి తీసుకోవాలి.  పట్టాదారుల పేర్లు, విస్తీర్ణం, మొబైల్ నంబర్ ఇతర వివరాలు గిరిజన సంక్షేమ కమిషనర్ కు సమర్పించాలి. ఖరీఫ్‌‌కు సంబంధించి మూడో తేదీ నుంచి ‘రైతుబంధు’ పంపిణీ ప్రారంభించాం. ఏడో తేదీ వరకు  7.19 లక్షల రైతుల ఖాతాల్లో రూ.781.17 కోట్లు జమచేశాం” అని అన్నారు.  రైతుబంధు సాయం వద్దనుకునేవారు ‘గివ్‌‌ ఇట్‌‌ అప్’ దరఖాస్తును ఏఈవో, ఎంఏవోకు సమర్పించాలని సూచించారు. ఈ నిధులను రైతు సమన్వయ సమితికి బదిలీ చేస్తామని ఎస్కే జోషి చెప్పారు.  2021 సెన్సెస్ కు సంబంధించి గ్రామ, పట్టణ రిజిస్టర్ల వివరాలను నవీకరించి కొత్త జనాభా లెక్కలను సమర్పించాలని జిల్లా కలెక్టర్లను జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా ఆదేశించారు.2021 జనాభా లెక్కల సేకరణకు సంబంధించి సన్నాహక పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.