జీవో 49 బీఆర్ఎస్, బీజేపీ పాపమే..!: ఆదివాసీలు నమ్మి మోసపోవద్దు

జీవో 49 బీఆర్ఎస్, బీజేపీ పాపమే..!: ఆదివాసీలు నమ్మి మోసపోవద్దు
  • 2016 నుంచే అమలుకు ప్రయత్నాలు
  • రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు

ఆదిలాబాద్, వెలుగు : పులుల సంరక్షణ పేరిట జీవో. 49 తేవడం బీఆర్ఎస్, బీజేపీ పాపమేనని రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. రాజకీయాల కోసమే తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఆయా పార్టీల నేతలను నమ్మి ఆదివాసీలు మోసపోవద్దని సూచించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తన ఇంట్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2016లోనే జీవో. 49కు బీజం పడిందని, అప్పుడు  బీఆర్ఎస్ ఎంపీగా గోడం నగేశ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా కోవ లక్ష్మి ఉన్నారని గుర్తు చేశారు. 

ఇప్పుడు బీఆర్ఎస్ కు సంబంధం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. టైగర్ కారిడార్ పేరిట లక్ష మంది ఆదివాసీలను నిర్వాసితులను చేయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు.  గెజిట్ నిర్ణయం విరమించుకోవాలని, లేదంటే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

రాష్ట్రంలో పదేండ్లు రాక్షస పాలన సాగిందని, ఇప్పుడు ప్రజాపాలనలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. రాజ్ గోండ్ సేవా సమితి అధ్యక్షుడిగా  ఈనెల 27న ప్రమాణ స్వీకారం చేస్తున్నానని, మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు హాజరువుతారని, ఆదివాసీలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.