
యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun), మాల్వి మల్హోత్రా(Malvi Malhotra) జంటగా ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం ‘తిరగబడర సామీ’(Tiragabadara Saami). ఈ మూవీ శుక్రవారం ఆగస్టు 2న థియేటర్లలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తిరగబడర సామీ సినిమాకు మేకర్స్ చేసిన ప్రమోషన్స్ కంటే వ్యక్తిగత విషయాల ద్వారా మొదలైన వివాదాలే ప్రమోషన్స్ చేసిపెట్టాయి. ముందుగా డైరెక్టర్ మన్నారా చోప్రాకి ముద్దు ఇవ్వడం. హీరో హీరోయిన్ల మీద హీరో మాజీ ప్రియురాలు యుద్దానికి దిగడం లాంటివి సినిమాకి మంచి ప్రమోషన్ చేసి పెట్టాయి. అలా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ను ఎలా ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే:
గిరి (రాజ్ తరుణ్) చిన్న వయస్సులోనే అమ్మ నాన్నలను నుంచి తప్పి పోయి ఓ అనాథలా పెరుగుతాడు. ఎవరూ లేక అనాథలా ఉన్న గిరిని చిన్నతనంలో ఆటో జానీ (బిత్తిరి సత్తి) చేరదీస్తాడు. అమాయకత్వం, భయం రెండు గిరికి ఎక్కువే. గొడవలకు దూరంగా సాదాసీదా జీవితాన్ని గడుపుతుంటాడు. తనలా తప్పిపోయిన వారిని కనిపెట్టి వారి వారి కుటుంబానికి దగ్గర చేయడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకుంటాడు. అలా అతని పేరు అందరికీ తెలిసిపోతుంది. ఓ టీవీ ఇంటర్వ్యూలో గిరిని చూసిన శైలజ (మాల్వి మల్హోత్రా) అతనికి క్లోజ్ అవుతుంది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లితో ఒక్కటవుతారు. ఇక అదే కాలనీలో ఉండే మటన్ మస్తాన్(రాజా రవీంద్ర), తులసమ్మ (ప్రగతి) సహా చుట్టూరా ఉండే ప్రతిఒక్కరు ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు.
అదే సమయంలో తన భార్య శైలజ కోసం కొండారెడ్డి (మకరంద్ దేశ్‌పాండే) ముఠా తన ఆచూకీ కోసం తిరుగుతుంటారు. ఈ క్రమంలో కొండారెడ్డి గ్యాంగ్ గిరి గురించి తెలుసుకుని అతన్ని కూడా పిలిపించి శైలజని వెతికి పెట్టాలని లేదంటే ప్రాణాలతో ఉండవని బెదిరించి కొడతారు. తన భార్య శైలజ రూ.2 వేల కోట్ల ఆస్తికి వారసురాలని తెలిశాక గిరి ఏం చేశాడు? శైలజ వచ్చాక గిరి జీవితంలో వచ్చిన మార్పులేంటి? ఇంతకీ శైలజకీ, కొండారెడ్డికీ మధ్య ఉన్న సంబంధమేమిటి? కొండారెడ్డితో గొడవల కారణంగా గిరికి ఆప్తులైన ఆటోజానీ (బిత్తిరి సత్తి), మస్తాన్ (రాజా రవీంద్ర), తులసమ్మ (ప్రగతి) ఎలాంటి కష్టాలు పడ్డారు? తదితర విషయాలు తెలియాలంటే థియేటర్లో మూవీ చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
తిరగబడరా సామీ మూవీని ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించారు. ఈ సినిమా స్టోరీ, స్క్రీన్‌ప్లే, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఏది కొత్తగా చూసిన ఫీలింగ్ అయితే కనిపించదు. ఎందుకంటే ఇది ఈ టైంలో రావాల్సిన సినిమా కాదు. ఓ పాతిక ఏళ్ల క్రితం రావాల్సిన సినిమా అని ప్రేక్షకునికి అనిపించక మానదు. కొండారెడ్డి గ్యాంగ్ వేట, హీరో హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు, ఆ తర్వాత ప్రేమ, పెళ్లి..ఇలా సాదాసీదాగా సాగుతుంది ఈ మూవీ. గిరిని శైలజ ఇష్టపడే సీన్స్ కొత్తగా ఉంటే బాగుండు అని ఫీలింగ్ కలిగిస్తోంది. ఫస్టాఫ్ లో శైలజ ఎవరనేది గిరికి తెలిసే నిజంతో సెకండాఫ్‌పై కాస్తంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు డైరెక్టర్.
ఇక ఆ తర్వాత శైలజని కొండారెడ్డి ముఠా నుంచి కాపాడుకోవడం కోసం గిరి వేసే ఎత్తుగడలు, ఆమె నేపథ్యంతో సాగే కొన్ని సీన్స్ పర్వాలేదనిపించినా, ఆ తర్వాత అన్ని మళ్లీ మామూలే అన్నట్టుగా కథనం సాగుతోంది. అయితే, ప్రతి సినిమాలో ఎక్కడో ఒకచోటైనా కామెడీ, ఎమోషన్స్ ఉండేలా బలమైన కథనాలను రాసుకుంటారు డైరెక్టర్. కానీ, ఈ సినిమాలో మాత్రం అవన్నీ కరువే. ఈ సినిమాకు డైరెక్టర్ మన్నారు చోప్రా కు ముద్దు పెట్టినా దగ్గరి నుంచి రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం వరకు వివాదాలతో నడిచిన..కథనంలో మాత్రం ఎలాంటి డోస్ లేదు.
ఎవరెలా చేశారంటే:
అతి భయస్తుడైన యువకుడి పాత్రలో రాజ్ తరుణ్ నటన పర్వాలేదనిపిస్తుంది. ఫస్టాఫ్ లో పిరికివాడిగా కనిపించి, సెకండాఫ్ లో యాక్షన్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. విలన్ గ్యాంగ్‌లో కనిపించిన మన్నారా చోప్రా గుర్తుండిపోయేలా అందాలు ఆరబోసింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా యాక్టింగ్ జస్ట్ ఒకే అనేలానటించింది. విలన్ మకరంద్ పాండే విలనిజం అంతగా పండలేదు. రఘుబాబు, బిత్తిరి సత్తి, పృథ్వీ, తాగుబోతు రమేష్ ఇలా..చాలా మంది కమెడియన్లు ఉన్నా ఎవరూ చెప్పుకోదగ్గట్టు మెప్పించలేకపోయారు.
టెక్నికల్ టీం
డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి కథలో బలం లేదు. జెబి సంగీతం చెప్పుకోదగ్గట్టుగా లేదు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రుచించవు. నిర్మాణ విలువలు సినిమా కథకు తగ్గట్టుగా ఉన్నాయి.