
- బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేకు
- రాజ్ థాకరే హెచ్చరిక
- మరాఠాలను కొడతామన్న
- దూబే కామెంట్‌పై ఆగ్రహం
ముంబై: మహారాష్ట్రలో భాషా వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. మహారాష్ట్రలో ఉండే వాళ్లంతా మరాఠీలో మాట్లాడాల్సిందేనని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే స్పష్టం చేశారు. మరాఠాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ క్రమంలోనే మరాఠీ మాట్లాడలేదనే కారణంతో ఎంఎన్ఎస్ కార్యకర్తలు పలువురిపై దాడులకు పాల్పడ్డ సంఘటనలూ చోటుచేసుకున్నాయి.
ఈ దాడులపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి నిశికాంత్ దూబే ఈ విషయంపై స్పందిస్తూ.. మేం కూడా మరాఠాలపై దాడులు చేస్తామని కామెంట్ చేశారు. దీనిపై ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే తీవ్రంగా స్పందిస్తూ.. దూబే ముంబైకి వస్తే సముద్రంలో ముంచుకుంటూ కొడతామన్నారు. శుక్రవారం మీరా భాయిందర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో థాకరే ఈ కామెంట్ చేశారు.
ఏ భాషతోనూ తనకు సమస్యలేదని, అయితే హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనికి మాత్రమే తాను వ్యతిరేకమని తెలిపారు. అలాగే, మహారాష్ట్రలో ఎక్కడికెళ్లినా మరాఠీలోనే మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘మరాఠీ భాష విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. మహారాష్ట్రలో నివసించే వారు తప్పనిసరిగా మరాఠీ నేర్చుకోవాలి.
ఎక్కడికెళ్లినా మరాఠీలోనే మాట్లాడాలి” అని థాకరే వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నిశికాంత్ దూబేపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ముందు నువ్వు (దూబే) ముంబైకి రా. వస్తే నిన్ను సముద్రంలో ముంచుకుంటూ కొడ్తం” అని థాకరే హెచ్చరించారు. అంతకుముందు దూబే మాట్లాడుతూ మరాఠీ ప్రజలపై అదేపనిగా దాడులు చేస్తామని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలకు థాకరే ఆవిధంగా కౌంటర్ ఇచ్చారు.
తాజాగా రాజ్ థాకరే కౌంటర్ పై దూబే స్పందించారు. ఓ వార్తా చానెల్ తో ఆయన మాట్లాడుతూ ఎవరి బెదిరింపులకూ తాను భయపడనని అన్నారు. ‘‘నా మాతృభాష హిందీపై నాకు గర్వంగా ఉంది. నేను ఎంపీని. రాజ్ థాకరే, శివసేన కార్యకర్తలాగా చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకోను. నాపై రాజ్ థాకరే దాడి చేస్తే, ఆయన ఎక్కడికెళ్లినా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు” అని దూబే అన్నారు.