
హైదరాబాద్, వెలుగు: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భవితవ్యంపై ఉత్కంఠ మొదలైంది. పార్టీకి చేసిన రాజీనామాను అధిష్టానం ఆమోదించడంతో ఆయన దారెటు అనే చర్చ జరుగుతున్నది. బీజేపీలో రాజాసింగ్‌కు వ్యతిరేకంగా ఉన్న ఓ వర్గం ఆయనపై అనర్హత వేటు వేయించేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారనే కారణంతో రాజాసింగ్ గత నెల 30న బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆ పార్టీ అధిష్టానం ఆమోదిస్తున్నట్టు ప్రకటించింది.
స్పీకర్‌కు ఫిర్యాదు చేసే యోచన..
బీజేపీ టికెట్‌పై గెలిచిన రాజాసింగ్.. ఆ పార్టీకి రాజీనామా చేయడంతో స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలనే యోచనలో రాష్ట్ర నేతలున్నారు. ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరనున్నట్టు తెలుస్తున్నది. దీనిపైన జాతీయ నాయకత్వంతోనూ చర్చించేందుకు రెడీ అయ్యారు. ఇది సక్సెస్ కాకపోతే.. రాజాసింగ్‌నే రాజీనామా చేసేలా ఒత్తిడి తేవాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా..? లేదా..? అనేదానిపై రాజాసింగ్ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఆయన అమర్‌నాథ్ యాత్రలో ఉన్నారు.
ఒకవేళ ఆయన వేరే పార్టీలో చేరితేనే పార్టీ ఫిరాయింపుల కిందకు వస్తుందని, ఆ సమయంలోనే ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చని కొందరు నేతలు చెప్తున్నారు. రాజాసింగ్ స్వతంత్ర అభ్యర్థిగానే కొనసాగాలనే భావనలో ఉన్నట్టు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ ఏ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాజాసింగ్ ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో చేరుతారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తన కార్యకర్తలు, అభిమానులతో చర్చించిన తర్వాతే ఏ నిర్ణమైనా తీసుకుంటానని స్పష్టం చేశారు.
================================================================