
ఎనిమిదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని సీఎం కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయలు దోచుకుందని మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. సంస్థాన్ నారాయణపురంలో బీజేపీ నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్, టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ కు అహంకారం ఎక్కువై 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నాడని ఆరోపణలు చేశారు. అప్పటినుంచి తాను కేసీఆర్ ను గద్దె దించాలని అనుకుంటున్నట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
వెయ్యి మంది పిల్లలు ప్రాణత్యాగం చేసింది కేసీఆర్ కుటుంబం కోసమేనా? అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రఘునందన్, వివేక్ వెంకటస్వామి, బండి సంజయ్ లు పోరాడుతున్నారని.. ఆ పోరాటానికి ఇటీవల బూర నర్సయ్య గౌడ్ కూడా మద్దతిచ్చారని అన్నారు. బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ దూసుకుపోతుందని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
తనని ఒడించడం కోసం మునుగోడుకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గాల అభివృద్ధికి కేసీఆర్ ను నిధులు అడిగే దమ్ముందా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన గడ్డ ఇదని, ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదన్నారు. అప్పుల పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మోడీ, అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.