కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడతాం

కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడతాం

కాంగ్రెస్ నాయకులు బుజ్జగించినా.. మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకే సిద్ధమైనట్లు సంకేతాలిచ్చారు. ప్రజాకంఠక పాలన చేస్తున్న సీఎం కేసీఆర్.. ఎన్నికలు వస్తేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అమలు చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడుపై సీఎం కక్షగట్టారని.. మూడున్నరేళ్లుగా అనేక రకాలుగా అవమానించి అభివృద్ధిని నిలిపేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అతి త్వరలోనే యుద్ధ ప్రకటన చేయబోతున్నానని రాజగోపాల్ రెడ్డి లెటర్ రిలీజ్ చేశారు.  SLBC, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ లు 90శాతం పనులు 2014కంటే ముందే పూర్తయినా.. కేవలం తనను గెలిపించారన్న కారణంతోనే ఈ ప్రాజెక్ట్ లు పక్కన పెట్టారని తెలిపారు.

గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట లెక్క అభివృద్ధి  చేస్తానంటే రాజీనామా చేస్తానని.. రెండేళ్ల క్రితమే చెప్పా అన్నారు రాజగోపాల్ రెడ్డి. హుజురాబాద్ లాగా మునుగోడు ప్రజలకు దళితబంధు, సంక్షేమ పథకాలు ఇస్తే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని ఏడాది క్రితమే చెప్పానన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అన్నివర్గాల ప్రజలకు ద్రోహం చేసిన కేసీఆర్-టీఆర్ఎస్ రాక్షస పాలన విముక్తి చేసే దిశగా.. తాను వేస్తున్న అడుగులో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. మునుగోడు నియోజకవర్గ సన్నిహితులు, ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులతో అన్ని విషయాలు చర్చించి కేసీఆర్ పాలనపై సమరశంఖం పూరించాలని నిర్ణయించామన్నారు రాజగోపాల్ రెడ్డి. అతి త్వరలో మరింత సంప్రదింపులు జరిపి.. మునుగోడు అభివృద్ధి, కేసీఆర్ నియంత పాలనకు చమరగీతం పాడే మరో కురుక్షేత్ర యుద్ధానికి సైరన్ పూరిస్తామని రాజగోపాల్ రెడ్డి అన్నారు.