రాజగోపాల్ రెడ్డికి బంపర్ మెజార్టీ వస్తది

రాజగోపాల్ రెడ్డికి బంపర్ మెజార్టీ వస్తది

బీజేపీని చూస్తే సీఎం కేసీఆర్ కు నిద్రపడ్తలేదని.. మునుగోడులో ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ది పనులు చేపడుతోందని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో బీజేపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. శివన్నగూడెంలో రైతులను ముంచి వారి భూములను గుంజుకుని ఆర్ ఆర్ ప్యాకేజీకి కింద నష్టపరిహారం ఇవ్వలేదన్నారు.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ముంపు గ్రామాల్లోని వారికి పరిహారం, రోడ్లు వేయడం, పెన్షన్ లు ఇస్తున్నారని విమర్శించారు. రాజీనామా చేసింది మునుగోడు ప్రజలకే అని అందరికీ అర్థమైందన్నారు. పాఠశాలలో పాఠ్యపుస్తకాలు ఇంకా రాకపోవడం శోచనీయమన్నారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ లేదని విమర్శించారు. కాళేశ్వరం కుంభకోణంలో డబ్బులు గుమ్మరించి.. ఖజానా ఖాళీ చేశాడన్నారు. మద్దతు ధర ఇచ్చేది కేంద్రమేనని ఇప్పుడు రైతులు అర్థం చేసుకున్నారని తెలిపారు. రైతుల బావుల దగ్గర మీటర్లు పెడుతారనంటూ విషపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.