
ఈ సంక్రాంతికి ‘గుంటూరు కారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. తన తర్వాతి సినిమా రాజమౌళి డైరెక్షన్‌లో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్‌కు రాజమౌళి గుడ్ న్యూస్ చెప్పారు. రీసెంట్‌గా జపాన్‌లో జరిగిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ స్పెషల్ షో ఈవెంట్‌కి వెళ్లిన జక్కన్న.. అక్కడ మహేష్ సినిమా గురించి మాట్లాడారు.
నెక్స్ట్ చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యానని చెప్పారు. ఇందులో హీరో మహేష్ తప్ప ఇతర నటీనటులు ఎవరూ ఫైనల్ కాలేదన్నారు. అంతేకాదు వీలైనంత త్వరగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేస్తానని .. సినిమా రిలీజ్ టైమ్‌లో తనను జపాన్‌కు తీసుకొస్తానని అన్నారు. రాజమౌళి ఫాస్ట్‌గా షూట్ కంప్లీట్ చేస్తానని చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం వర్క్ షాప్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.