
బాహుబలి చిత్రంతో దర్శకధీరుడు రాజమౌళి పేరు దేశమంతా మారుమ్రోగిపోయింది. ఆ తరువాత తన తదుపరి చిత్రం ఆర్ఆర్ఆర్ అని రాజామౌళి ప్రకటించాక చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు. అసలు ఆ టైటిల్ ఎంటని చాలా మంది విమర్శలు చేశారు. అల్లూరి, కొమరం భీమ్ ల చరిత్ర అధారంగా రాజమౌళి సినిమా చేస్తున్నాడని తెలియడంతో చరిత్రను వక్రీకరిస్తున్నారని కొందరు కామెంట్లు చేశారు . అల్లూరి బ్రిటిషర్ల దగ్గర పనిచేయడం ఏంటని, కొమరం భీమ్ కు బ్రిటిషర్లకు మధ్య సంబంధం ఏంటని చాలా మంది ప్రశ్నించారు.
దీనిపై రాజమౌళి క్లారిటీ ఇచ్చిన వివాదాలు ఆగలేదు. సినిమాను అడ్డుకుంటామన్న హెచ్చరికలు కూడా వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ అయి ఓ సంచలనం సృష్టించింది. రాజామౌళి టేకింగ్, ఎన్టీఆర్,రామ్ చరణ్ ల నటన, నాటునాటు పాటకు వారిద్దిరి డాన్స్, యాక్షన్ విజువల్స్ మ్యూజిక్ వంటి వాటి ముందు ఇలాంటి విమర్శలు నిలవలేకపోయాయి. సినిమా ప్రజల్లోకి దూసుకుపోయింది. పలు ప్రాంతీయ భాషల నుంచి ప్రపంచ స్థాయి భాషల వరకు డబ్ అయి త్రిబుల్ ఆర్ సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆస్కార్ వేదికపై గెలుపు బావుటా ఎగురవేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అస్కార్ పురస్కారాన్ని ముద్దాడింది. ఆస్కార్ దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా రికార్డు సృష్టించింది.
సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే ఆస్కార్ పురస్కారాన్ని అందుకుని ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసింది. నాటునాటు పాటకు కీరవాణి స్వరాలు సమకూర్చగా చంద్రబోస్ సాహిత్యం అందించారు, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట సినిమాకే బిగ్గెస్ట్ హైలెట్ గా నిలిచింది.