సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ (Varanasi). ఈ మైథికల్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఓ వైపు కళ్ళు చెదిరేలా భారీ బడ్జెట్, వరల్డ్ సినీ పరిశ్రమ షాక్ అయ్యేలా సెట్స్ నిర్మాణం. ఇవన్నీ వారణాసి మూవీని అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచేలా చేశాయి. ఇందులో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు.
సాధారణంగా రాజమౌళి సినిమాలంటేనే అత్యంత రహస్యంగా ఉంటాయి. షూటింగ్ వివరాలు, పాత్రల లుక్స్, స్టోరీ బ్యాక్ డ్రాప్ వంటి అంశాలను చాలా రహస్యంగా ఉంచుతుంటారు. కానీ ఇటీవల కొన్ని అంతర్జాతీయ పత్రికలకు సెట్స్‌ను సందర్శించే అవకాశం లభించడంతో ఈ సినిమా రేంజ్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం సెట్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
‘మాత చిన్నమస్తా దేవి’ ఫొటో వైరల్:
‘వారణాసి’ సినిమాకు సంబంధించిన ఓ సెట్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో భారీ బ్లూ స్క్రీన్ బ్యాక్‌డ్రాప్ మధ్య రాతి కొండలు, పురాతన శిలా స్తంభాలతో రూపొందించిన అద్భుతమైన సెట్స్ కనిపిస్తున్నాయి. ఈ విజువల్స్ చూస్తుంటే రాజమౌళి ఈసారి మరో భారీ విజువల్ వండర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం, ఈ సీక్వెన్స్‌లో హిందూ పురాణాల్లో అత్యంత ఉగ్రరూపంగా భావించే మాత చిన్నమస్తా దేవి విజువల్స్ ఉండనున్నాయట. మాత చిన్నమస్తా దేవిని ప్రచండ చండిక అని కూడా పిలుస్తారు. త్యాగం, పరివర్తన, విశ్వ సమతుల్యతకు ప్రతీకగా నిలిచే ఈ దేవి రూపాన్ని సినిమాలో కీలకంగా చూపించనున్నట్టు సమాచారం. టీజర్లో ఆమె తన తల తానే తెంచుకుని, తన రక్తాన్ని అనుచరులకు అందిస్తున్నట్లుగా చూపించిన విజువల్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి.
ఛిన్నమస్త అనగా: "ఖండింపబడిన శిరస్సు" అని అర్థం. అమ్మవారు తన చేతిలో తన సొంత తలను పట్టుకుని, దాని నుండి వచ్చే రక్తధారలను తన భక్తులకు (యోగినీ, డాకినీ) మరియు తన తెగిపడిన కంఠానికి తానే స్వయంగా స్వీకరిస్తూ భీకరమైన రూపంలో దర్శనమిస్తుందని పురాణాలూ చెబుతున్నాయి
Ugrabati cave in #Varanasi 😍🔥 pic.twitter.com/Ut6OVod1tz
— Smudge (@Hitesh5ir) May 26, 2026
లీకైన ఫొటోలో స్టార్ క్యాస్ట్స్ కనిపించకపోయినా, సినిమా సెట్స్ ఎంత భారీ స్థాయిలో నిర్మించారో స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా బ్లూ స్క్రీన్ల వినియోగం చూస్తుంటే, ఈ సన్నివేశాలకు భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఉపయోగించనున్నారని అర్థమవుతోంది.
ఉగ్రభట్టి గుహల సీక్వెన్స్..
సినిమా కథలో భాగంగా మహేష్ బాబు పోషిస్తున్న ‘రుద్ర’ పాత్ర పురాతన ఆర్టిఫాక్ట్స్ కోసం చేసే అన్వేషణలో ఉగ్రభట్టి గుహలు అనే ప్రాంతానికి చేరుకుంటాడట. అక్కడ చిన్నమస్తా దేవి ఆశీర్వాదం పొందడం ద్వారా ఒక పురాతన దుష్టశక్తిని ఎదుర్కొనే శక్తిని సంపాదిస్తాడనే టాక్ వినిపిస్తోంది. ఇపుడు వైరల్ అవుతున్న ఫోటో, టీజర్ లో కనిపించే విజువల్ కథపై అంచనాలు పెంచేసింది.
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘కాశీ నగరం’!
హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జక్కన్న భారీ స్థాయిలో ‘కాశీ నగరం’ నిర్మిస్తున్నారని సమాచారం. కాశీ నగర వాతావరణాన్ని ప్రతిబింబించేలా గంగాఘాట్లు, పురాతన ఆలయాలు, శిల్పాలు, దేవతా విగ్రహాలతో అద్భుతంగా రూపకల్పన చేస్తున్నారట. ఆ సెట్ నిర్మాణానికి రూ.50 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి రాయి, ప్రతి విగ్రహం, ప్రతి షాడో కూడా నిజమైన కాశీ వాతావరణాన్ని తలపించేలా సెట్స్‌ను అద్భుతంగా రూపొందిస్తున్నారట.
వారణాసిలో ప్రసిద్ధి చెందిన వంగి ఉండే (Leaning Temple) రత్నేశ్వర్ ఆలయాన్ని అదే కోణంలో, అదే లోతులో అత్యంత ఖచ్చితత్వంతో ఇక్కడ పునర్నిర్మించారంటే జక్కన్న మార్క్ ఎటువంటిదో ముందే తెలిసిపోయింది.
త్రేతాయుగం నుంచి 2027 వరకు సాగే కథ..
‘వారణాసి’ కేవలం పీరియడ్ డ్రామా మాత్రమే కాదు. ఇది మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న భారీ అడ్వెంచర్ డ్రామా. కథ త్రేతాయుగం నుంచి ప్రారంభమై ప్రస్తుత కాలాన్ని దాటి 2027 వరకు సాగుతుందని సమాచారం. కాలం మారుతున్న కొద్దీ వారణాసి నగరం ఎలా మారిందో చూపించేందుకు సెట్స్‌లో ప్రత్యేక మార్పులు చేస్తున్నారట.
ఇందుకోసం అత్యాధునిక హైడ్రాలిక్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక పురాతన కట్టడాన్ని 12 అడుగుల లోతుకు భూమిలోకి దించి, పాతకాలపు సన్నివేశాల కోసం మళ్లీ పైకి తీసుకొచ్చే విధంగా ప్రత్యేక సెటప్ రూపొందించారట. ఈ విజువల్స్ సినిమాకు మరో స్థాయి గ్రాండియర్‌ను తీసుకురానున్నాయని టాక్.
ఇక మహేష్ బాబు త్రిశూలం పట్టుకుని కాశీ ఘాట్లపై నడుస్తూ వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే లీక్ అయిన ఫొటోలు, సెట్స్ విజువల్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.
‘వారణాసి’కి శ్రీరామనవమి తోడు..
ఈ భారీ అడ్వెంచర్ డ్రామా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా విడుదలైన వారం రోజుల్లోనే శ్రీరామ నవమి వస్తుండటం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. దీంతో దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల చూపంతా ఇప్పుడు రాజమౌళి-మహేష్ కాంబినేషన్‌పైనే ఉంది.
