- ప్రైవేట్ కంపెనీ వీసా పేరుతో ఏజెంట్ మాయ
- పోలీసులను ఆశ్రయించిన భార్య రజిత
ఎల్లారెడ్డిపేట, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్యోగాల పేరుతో నకిలీ ఏజెంట్లు చేస్తున్న మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ కు చెందిన యువకుడి ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్సై రమేశ్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దొమ్మాటి కిషన్, రజిత దంపతులు గ్రామంలోనే పనులు చేసుకునేవారు. సరైన ఆదాయం లేకపోవడంతో కిషన్ ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సిరిసిల్లకు చెందిన ఆదిత్య మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ ఏజెంట్ దారుణం శ్రీనివాస్‌ను సంప్రదించాడు.
రష్యాలో ఉద్యోగాలు ఉన్నాయని, వీసా కోసం రూ.2.50 లక్షలు ఖర్చవుతుందని ఏజెంట్ చెప్పడంతో కిషన్ అప్పు చేసి ఆ మొత్తాన్ని చెల్లించాడు. గత నెల 5న కిషన్‌ను రష్యాకు పంపించాడు. అక్కడికి వెళ్లిన తర్వాత తాను మోసపోయినట్లు కిషన్ గుర్తించి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. కంపెనీ వీసా పేరుతో ఏజెంట్ నకిలీ వీసా ఇవ్వడంతో రష్యా ఆఫీసర్లు తనను రష్యన్ ఆర్మీలో బలవంతంగా చేర్చారని తెలిపాడు.
అనంతరం ఉక్రెయిన్ సరిహద్దులకు పంపించారని, యుద్ధ వాతావరణంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నానని భార్య రజితకు ఫోన్ చేసి కన్నీటిపర్యంతమయ్యాడు. తనను ఎలాగైనా తిరిగి ఇండియాకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. కిషన్ పరిస్థితిని తెలుసుకున్న రజిత ఎల్లారెడ్డిపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
