దేశం దాటాకే రాజీనామా చేస్తా

దేశం దాటాకే రాజీనామా చేస్తా
  • కొలంబోలో కొనసాగుతున్న కర్ఫ్యూ  
  • అనుకున్న చోటకు వెళ్లిన తర్వాతే పదవి వీడతారని ప్రచారం

కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. కొలంబోని వీధుల్లో దేశ సైన్యం గస్తీ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆందోళనకారులు అధ్యక్ష, ప్రధాని నివాసాన్ని  వదిలి వెళ్తున్నట్లు  ప్రకటించారు. కానీ ఆందోళనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే లంక వీధుల్లో ఆర్మీ పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. రెండు రోజుల క్రితం దేశాన్ని  విడిచి పారిపోయిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే మాల్దీవుల నుంచి సౌదీ ఎయిర్ లైన్స్ చెందిన ఎయిర్ లైన్స్ లో  సింగపూర్ కు వెళ్లారు. అయితే గొటబాయ సింగపూర్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఖండించిన రాజపక్సే కుటుంబ సభ్యులు
రాజపక్సే జెడ్డాకు వెళ్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కుటుంబసభ్యులు ఖండించారు. దేశం దాటిన తర్వాతే రాజీనామా చేస్తానని మెలిక పెట్టిన గొటబాయ..అనుకున్న ప్లేస్ వెళ్లాకే పదవిని వీడతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో కొలంబో కర్ఫ్యూ కంటిన్యూ  చేస్తున్నారు. రేపు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.