రాజాసింగ్ క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్త : ఉషాబాయి

రాజాసింగ్ క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్త  : ఉషాబాయి

హైదరాబాద్, వెలుగు: రాజాసింగ్ క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్త అని, ఆయన చేతిలో ఉండేది కమలం జెండానే అని ఆయన భార్య ఉషాబాయి స్పష్టం చేశారు. ఆయనలో ప్రవహించేది కాషాయ రక్తమే అని అన్నారు. దేశం, ధర్మం కోసం నిరంతరం కష్టపడి పనిచేసే ఆయన, అదే ధర్మం కోసం జైల్లో ఉన్నారని గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ టైంలో హిందూ సమాజం, బీజేపీ కార్యకర్తలు, రాజాసింగ్ అభిమానులంతా అండగా ఉంటూ.. ధైర్యం ఇచ్చారని పేర్కొన్నారు.

‘‘రాజాసింగ్ కుటుంబం అనాథ కాదు. ఇంత పెద్ద హిందూ సమాజం మాకు అండగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజాసింగ్ పేరు చెప్పుకుంటూ కొందరు కుట్రలు చేస్తున్నరు. రాజకీయ లబ్ధి కోసం ఆయన్ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారిపట్ల పార్టీ కార్యకర్తలు, రాజాసింగ్ అభిమానులు జాగ్రత్తగా ఉండాలి’ అని ఉషాబాయి సూచించారు. ధర్మం కోసం ఎన్ని రోజులైనా జైల్లో ఉండేందుకు రాజాసింగ్​ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ధర్మం పేరుతో కొందరు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.