RRR: అసెంబ్లీలో రాజాసింగ్, రఘునందన్, రాజేందర్

RRR: అసెంబ్లీలో రాజాసింగ్, రఘునందన్, రాజేందర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ ట్రిపుల్ఆర్​ ఫార్ములా ఫలించింది. ఇప్పటికే బీజేపీ తరఫున ఇద్దరు ఎమ్మెల్యేలుండగా తాజాగా మరో ఎమ్మెల్యే అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లలో మొదటి అక్షరం‘ఆర్​’తో స్టార్ట్ కావడంతో ట్రిపుల్ఆర్ అనే స్లోగన్ తెరమీదికొచ్చింది. నిజానికి సినిమా డైరెక్టర్​రాజమౌళి డైరెక్షన్​లో రాంచరణ్, రామారావు(ఎన్​టీఆర్) హీరోలుగా ‘ఆర్​ఆర్​ఆర్’ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.  బీజేపీ ఎమ్మెల్యేల పేర్లు కూడా ఇదే కోవలోకి రావడంతో ఆర్​ఆర్​ఆర్​ స్లోగన్ పాపులర్ అయింది. ప్రస్తుతం ఈటల గెలుపుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే బీజేపీ తరఫున జనరల్ ఎన్నికల్లోనే గోషామహల్ నుంచి రాజాసింగ్ విజయం సాధించగా, గతేడాది దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేసిన రఘునందన్ రావు గెలుపొందారు. తాజాగా హుజూరాబాద్ ఎన్నికలో ఈటల రాజేందర్ విజయం సాధించారు. దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా అసెంబ్లీలో అప్పటికే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు‌‌కు తోడుగా రఘునందన్‌‌రావు గెలిస్తే సీఎం కేసీఆర్‌‌కు అసెంబ్లీలో ట్రిపుల్ఆర్(ఆర్ఆర్​ఆర్) సినిమా చూపిస్తామని బీజేపీ నేతలు పేర్కొన్నారు. అనుకున్నట్టే అప్పట్లో రఘునందన్​రావు విజయం సాధించారు. అయితే ఆ తర్వాత రామచంద్రరావు ఎమ్మెల్సీగా పదవీకాలం ముగియడం, ఆ తర్వాతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో మళ్లీ బీజేపీ డబుల్​ఆర్ ​(రాజాసింగ్, రఘునందన్​రావు)గా మారింది. తర్వాత జరిగిన నాగార్జునసాగర్ బైపోల్‌లో బీజేపీ అభ్యర్థి రవి కుమార్​ కావడంతో ట్రిపుల్ఆర్ నినాదం మరోసారి తెరపైకి వచ్చింది.  హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ బరిలో నిలవడంతో, మరోసారి ట్రిపుల్ఆర్‌‌ స్లోగన్ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం రాజేందర్ గెలుపుతో బీజేపీ ‘ఆర్ఆర్​ఆర్’ టీమ్ ఫామ్ అయినట్టయింది. సోషల్​ మీడియాలో రాజాసింగ్, రఘునందన్​రావు, రాజేందర్ ఫొటోలు కలిపి ‘ఆర్ఆర్​ఆర్’ టీమ్ అంటూ పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.