అందమైన ప్రదేశాలకు కేరాఫ్ రణక్ పూర్

అందమైన ప్రదేశాలకు కేరాఫ్ రణక్ పూర్

రణక్​ పూర్​... రాజస్తాన్లోని ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఉన్న ఒక చిన్న ఊరు. పాలి జిల్లాలోని ఉదయపూర్​కు ఉత్తరాన 96 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఊరు. ఇది జైనులకు ఒక ముఖ్యమైన ప్రదేశం. ఎందుకంటే ఇక్కడ జైన దేవాలయాలు ఎక్కువ. వాటిలో రణక్​పూర్ పాలరాతి ఆలయం ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ ఆలయాన్ని కట్టడానికి15వ శతాబ్దంలో కొంత భూమిని విరాళంగా ఇచ్చాడు నాటి పాలకుడు ‘రాణా కుంభ’. ఆ తర్వాత దన్నా షా అనే వ్యాపారి దైవ దర్శనం పొందడంతో దీన్ని ఆయనే కట్టించాడని అంటారు. ఆ ఆర్కిటెక్చర్​ స్టైల్ పురాతన మీర్​పూర్  జైన్ టెంపుల్​ని ఆధారం చేసుకుని కట్టారు. జైనమతంలోని కొందరు తీర్థంకరులకు అంకితం చేసిన ఆదినాథ, పరస్​ నాథ్​, చౌముఖ దేవాలయం వంటి అద్భుత నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి. ‘ఆరావళిలోని ఆధ్యాత్మిక ఒయాసిస్’ అని ముద్దుగా పిలుస్తారు. ఈ ఊరికి రణక్​పూర్ అనే పేరు మాత్రం ‘రాణా కుంభ’ పేరు మీదుగా వచ్చింది. 

ఆలయ ప్రత్యేకత

మనదేశంలోని అత్యంత అందమైన ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటి రణక్​ పూర్. ఇక్కడి ప్రధాన ఆలయం, చౌముఖ మందిర్ (నాలుగు ముఖాల ఆలయం), మొదటి జైన తీర్థంకరుడు ఆదినాథ్​కు అంకితమిచ్చారు. ఇది మనదేశంలోని జైన సమాజానికి ముఖ్యమైన పుణ్యక్షేత్రం. దీన్నే ‘చతుర్ముఖ ధారణ విహార’ అని పిలుస్తారు. అదే మార్బుల్ జైన్​ టెంపుల్​ కూడా. జైన దేవాలయాలన్నింటిలోనూ ఇది అద్భుతమైనది, అందమైనదిగా చెప్తారు. దీనికి నాలుగు ముఖాలు ఉన్నాయి. రాతితో చెక్కిన ఈ అందమైన, అద్భుతమైన నిర్మాణం మనదేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పూర్తిగా తెల్లని పాలరాయితో కట్టిన ఈ ఆలయంలో 29 మందిరాలు, 80 గోపురాలు, 1,444  చెక్కిన స్తంభాలు ఉన్నాయి. లేత గోధుమరంగుతో అలంకరించిన స్తంభాలు చాలా అందంగా ఉంటాయి. అందులో ఏనుగులు, పువ్వులు, వ్యక్తులు ఉన్న శిల్పాలు కనిపిస్తాయి. ఇంట్రెస్టింగ్​ ఇక్కడ ఏంటంటే, ఏ రెండు స్తంభాలు ఒకేలా ఉండవు! రణక్​ పూర్ ఆలయంలో ఎత్తైన, గోపురం పైకప్పులు, విశాలమైన కారిడార్లు ఉన్నాయి. వనదేవతలు, సంగీత వాయిద్యాలను వాయించే కన్యల శిల్పాలతో పైకప్పులు డిజైన్ చేశారు. ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న అతిపెద్ద శిఖరం కింద ఆరు అడుగుల ఎత్తైన ఆదినాథ్ విగ్రహాన్ని చూడొచ్చు.రంగు మార్చే స్తంభాలు ఈ ఆలయ ప్రత్యేకత. వీటిలో ఒకటి అసంపూర్తిగా ఉంది. చివరిది పూర్తయ్యేసరికి ఒకటి విరిగిపోయేదట. అందువల్ల చెడు దృష్టి నుంచి తప్పించుకోవడానికి దాన్ని అలాగే వదిలేశారని చెప్తారు. ఈ స్తంభాలు పగటిపూట గంట గంటకు బంగారు రంగు నుంచి లేత నీలం రంగులోకి మారతాయి. ఆలయంలోని ఏ రెండు స్తంభాలకు ఒకే విధమైన డిజైన్లు ఉండవు. ప్రార్థనా మందిరంలోని రెండు పెద్ద గంటలు చేసే చప్పుడు వినసొంపుగా ఉండి, భక్తుల చెవులకు పాటలా అనిపిస్తాయి. హాల్​, ప్రాంగణాలలో ఎప్పుడూ చల్లని గాలి వీచే విధంగా ఇంటీరియర్ డిజైన్ చేశారు. 

సద్రిలో జైన దేవాలయాలు

రణక్​ పూర్​ ఆలయం చుట్టూ మరో రెండు జైన దేవాలయాలు ఉన్నాయి. రాజస్తాన్లోని పాలి జిల్లాలో ఉన్న ఒక చిన్న టౌన్ సద్రి. జైన సమాజానికి ప్రధాన ప్రార్థనా స్థలాలలో ఇదొకటి. రణక్​ పూర్​ జైన దేవాలయం, శ్రీ పరశురామ్ మహాదేవ్ మందిర్లకు దగ్గరి ప్రదేశం. ఇది సింధాల్ రాథోడ్స్​ పాలనలో ఉండేది. సద్రిలో పద్నాలుగు పురాతన జైన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో పరశురామ్ మహాదేవ్ ఆలయం, వరాహావతార్ ఆలయం, చింతామణి పరస్​ నాథ్ ఆలయం వంటివి ఉన్నాయి. అంతేకాకుండా కుంభాల్​ గఢ్ వైల్డ్​ లైఫ్ శాంక్చురీ, ఘనేరావ్ రావ్లా, నార్లై రావ్లా వంటివి కూడా ఉన్నాయి.

సూర్య నారాయణ టెంపుల్

ఇది కూడా రణక్​ పూర్​లో ఉంది. ఈ ఆలయాన్ని అందమైన బొమ్మలతో డిజైన్ చేశారు. ఆ బొమ్మలు అద్భుతంగా ఉంటాయి. దీన్ని సూర్య దేవుడికి అంకితమిచ్చారు. ఇందులో ఏడు గుర్రాల మీద స్వారీ చేస్తున్న సూర్య దేవుడి శిల్పం ఉంటుంది. దీనికి దగ్గర్లోనే అంబా మాత దేవాలయం కూడా ఉంది. 

ముచ్చల్ మహవీర్ టెంపుల్

ఇది రణక్​ పూర్​కి దగ్గర్లోని ఘనేరావు గ్రామంలో ఉంది. దీన్ని మహవీర్ దేవుడికి అంకితమిచ్చారు. ఈ ఆలయంలో మహవీర్ దేవుడి విగ్రహంలో మీసం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. టెంపుల్ ద్వారం దగ్గర ఏనుగుల శిల్పాలు రెండు ఉంటాయి. ఈ టెంపుల్​కి దగ్గరలో ‘గరాసియా’ అనే గిరిజన గ్రామం ఉంది. అక్కడి ప్రజలు రంగురంగుల డ్రెస్​లు వేసుకుంటారు. 

నార్లై 

రణక్​ పూర్​ నుండి 6 కిలోమీటర్ల దూరంలో కొండ కింది వైపు ఉన్న చిన్న గ్రామం నార్లై. ఇది హిందూ, జైన దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం.  మొదటి జైన తీర్థంకరుడైన ఆదినాథునికి, జైన దేవాలయాన్ని అంకితమిచ్చారు. ఆలయమంతా మ్యూరల్ పెయింటింగ్స్​తో అందంగా ఉంటుంది. 

ఇలా వెళ్లాలి

ఉదయ్​పూర్​లోని దబొక్ ఎయిర్​ పోర్ట్, మహారాణా ప్రతాప్ ఎయిర్ పోర్ట్​ లేదా న్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్​ పోర్ట్​ నుంచి వెళ్లొచ్చు. రణక్​ పూర్ వెళ్లడానికి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య బెస్ట్ టైం. ఇతర సీజన్​ల కంటే చలికాలం అక్కడి వాతావరణం బాగుంటుంది.

పింక్ చిరుత!

పోయినేడాది దేశంలోనే మొదటిసారి గులాబీ రంగు చిరుత కనిపించిందని వార్తలొచ్చాయి. అది కనిపించింది రణక్​పూర్​ ప్రాంతంలోనే. ఇలాంటి రంగు చిరుత కనిపించడం ఇదే మొదటిసారి. అయితే, రణక్​పూర్, కుంభాల్ గఢ్​ గ్రామస్తులు ఈ చిరుతను చాలాసార్లు చూశారట. 

ఏమేం చేయొచ్చంటే..

ఇక్కడ చూడటానికి ఆర్కిటెక్చర్​​ ఒక్కటే కాదు, ఇంకా ఎన్నో విశేషాలున్నాయి. ఎంజాయ్ చేయడానికి రకరకాల యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. 

గుర్రపు స్వారీ 

రణక్​ పూర్​లో గుర్రపు స్వారీ చేయొచ్చు. ఒకరోజంతా హార్స్ సఫారీ టూర్ వేయొచ్చు. ఆ రైడ్​లో అందమైన ఆరావళి పర్వతాలు, చిన్న ఊళ్లు, సరస్సులు, నదులు, వాటర్​ ఫాల్స్, లోయలు కూడా చూడొచ్చు.

జీప్​ సఫారీ

వైల్డ్​ లైఫ్ టూర్​ వేయొచ్చు ఈ ట్రిప్​లో. రకరకాల జంతులు కనిపిస్తాయి. వైల్డ్ లైఫ్​ లవర్స్​కి ఇది నిజంగా చాలా మంచి ఎక్స్​పీరియెన్స్​ ఇస్తుంది. కెమెరా వెంటపెట్టుకుని నచ్చినట్లు ఫొటోలు తీసుకోవచ్చు. ఈ సఫారీతో ఎన్నో మెమొరీస్ ఉంటాయి. 

ట్రెక్కింగ్

రణక్​ పూర్​ నుంచి థండిబెరి వరకు ట్రెక్కింగ్ చేయొచ్చు. ట్రెక్కింగ్ చేసేటప్పుడు ప్రకృతి అందాలను చూడొచ్చు. అందమైన ప్రదేశాల్లో ట్రెక్కింగ్ చేయడం చాలా సరదాగా ఉంటుంది. ట్రెక్కింగ్​లో కూడా కొన్ని వైల్డ్​ లైఫ్​ యానిమల్స్ కనిపిస్తాయి. ఆరుగంటలు ట్రెక్కింగ్ చేయొచ్చు. అన్ని గంటలు చేయలేరనుకుంటే రెండుగంటల కూడా చేయొచ్చు. 

జాబా ఉల్ఫ్ పాయింట్

జీప్​ సఫారీ చేస్తూ జాబా ఉల్ఫ్​ పాయింట్​కి వెళ్లొచ్చు. అది రణక్​ పూర్​ నుంచి కొద్ది దూరంలో ఉన్న జాబా విలేజ్​లో ఉంటుంది. ఆ దారి వెంట వైల్డ్​ యానిమల్స్, బర్డ్స్ కనిపిస్తాయి. జాబా ఉల్ఫ్ పాయింట్ దగ్గర తోడేళ్ల సంచారం ఎక్కువ. మనుషులు ఎక్కువగా తిరగరు. కాబట్టి ఆ పాయింట్​లో తోడేళ్లను చూడొచ్చు.