
- 2020 లో అప్లికేషన్ చేసుకున్న వారికే
- కొత్త వారి విషయంలో సర్కార్ గైడ్ లైన్స్ ఇస్తేనే
- గతంలో ఉమ్మడి జిల్లాలో 1,36,853 అప్లికేషన్లు
నల్గొండ, యాదాద్రి, వెలుగు : భూభారతి చట్టంతో సాదాబైనామాలతోపాటు భూ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏండ్ల తరబడి నిరీక్షణకు తెరపడుతుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ప్రభుత్వం కూడా ఉమ్మడి రాష్ట్రంలో కొనుగోలు జరిగిన భూములకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్ణయంతో రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.
ధరణి పోర్టల్‌తో ఇబ్బందులు..
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో అనేక మంది రైతులు ఇబ్బందులు పడ్డారు. భూ రికార్డుల్లో పేర్లు, భూ విస్తీర్ణం, సర్వే నంబర్లు తప్పుగా నమోదయ్యాయి. వాటి సవరణకు కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ రైతులు తిరిగినా సమస్యలు పరిష్కారం కాలేదు. ఎనిమిదేండ్ల క్రితం ల్యాండ్ రికార్డు ఆప్డేషన్ ప్రోగ్రామ్ (ఎల్‌ఆర్‌యూపీ) తెచ్చింది. ఇందులో భాగంగా అన్ని రికార్డులను డిజిటలైజ్ చేయడంతోపాటు ధరణి చట్టం ద్వారా కొత్త పాసు పుస్తకాలు జారీ చేసింది.
ఆ సమయంలో పొరపాట్లు జరిగాయి. భూ విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు రావడం, ఒకరి సర్వే నంబర్‌లోని భూమి మరొకరి పేరిట నమోదయ్యాయి. కాస్తు కాలం ఎత్తి వేయడంతో అనుభవంలో ఉన్న వారు అధికారికంగా హక్కులు కోల్పోయి, పట్టాదారుల పేర్లపై పాసుబుక్కులు రావడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. కాస్తుదారుల కాలంలో ఉన్న వారితోపాటు సాదాబైనామాల ద్వారా ఆస్తులు కొనుగోలు చేసినవారు కూడా తర్వాత ఇరకాటంలో పడ్డారు. రెవెన్యూ కార్యాలయాల్లో మాన్యువల్ రికార్డులకు అవకాశం లేకుండా చేశారు.
అప్లికేషన్లు ఆహ్వానించినా..
సాదాబైనామాలో ఉన్న భూములకు పట్టాలిచ్చేందుకు గత ప్రభుత్వం అప్లికేషన్లను ఆహ్వానించింది. ఆ మేరకు సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 1,27,353 అప్లికేషన్లు, యాదాద్రి జిల్లాలో 13,500 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో 4 వేలు తిరస్కరించగా, 9,500 అప్లికేషన్లు ఒకే చేశారు. అయితే ధరణిలో సాదాబైనామాల పరిష్కారానికి ఆప్షన్ లేకపోవడంతో పెండింగ్ లో ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే ధరణి తొలగిస్తామని ఎన్నికల ముందు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. పలు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. సాదా బైనామాల అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు.
ఆర్డీవోలకు బాధ్యతలు..
కొత్త చట్టంలోని సెక్షన్6, రూల్6 ప్రకారం సాదాబైనామాలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా –2014 జూన్ కంటే ముందు సాదాబైనామాల ద్వారా భూమి కొనుగోలు చేసి 12 ఏండ్లు స్వాధీనంలో ఉండడంతోపాటు గత ప్రభుత్వం నిర్ధేశించిన గడువులో చేసుకున్న దరఖాస్తులపై ఆర్డీవోలు విచారణ జరుపుతారు. పీవోటీ, సీలింగ్ ఆయా చట్టాల ఉల్లంఘన లేదని నిర్ధారించుకున్న తర్వాత అర్హత ఉన్న రైతుల నుంచి ప్రస్తుత రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారు. హక్కుల రికార్డుల్లో నమోదు చేసి పాసు పుస్తకం జారీ చేస్తారు. జూన్ 2 నుంచి కొత్త చట్టం పూర్తి స్థాయిలో అమలు కానుండడంతో రైతులు తమ కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు.