మిర్చి రీసెర్చ్​ సెంటర్​ ఏమాయే .. తెగుళ్లతో నష్టపోతున్న రైతులు

మిర్చి రీసెర్చ్​ సెంటర్​ ఏమాయే .. తెగుళ్లతో నష్టపోతున్న రైతులు
  • చపాటా మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు
  • మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఎదురు చూస్తున్న కర్షకులు 
  • జిల్లాలో ప్రతి ఏడాది విరివిగా మిర్చి పంట సాగు

మహబూబాబాద్, వెలుగు : ఎర్రబంగారంగా పిలుచుకునే మిర్చి రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భౌగోళిక గుర్తింపు పొందిన వరంగల్ చపాటా మిర్చి ప్రత్యేకం. కానీ, ఆ స్థాయిలో పరిశోధనలు లేకపోవడంతో మిర్చి రైతులు నష్టాలను చవిచూడక తప్పడం లేదు. సాగులో తెగుళ్లు, నల్లి తామర పురుగు నుంచి కాపాడుకునేందుకు రైతులు అధిక పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోతున్నారు. రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఆచార్య కొండ లక్ష్మణ్​ఉద్యాన విశ్వవిద్యా లయం ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కన్నారావుపేటలో  మిర్చి పరిశోధన కేంద్రం నిర్మాణానికి 2023 అక్టోబర్​ 6న శంకుస్థాపన చేశారు. 

ఏడాదిన్నర గడుస్తున్నా పరిశోధన కేంద్రం పనులు మొదలు కాలేదు. మహబూబాబాద్​జిల్లా కేంద్రంలోనూ విరివిగా ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండటంతో పాటుగా మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని ఇక్కడి రైతులు డిమాండ్​ చేస్తున్నారు. మానుకోట జిల్లాలో మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం 400 ఎకరాల్లో ఉండడంతో మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అనువుగా ఉంటుందని రైతులు అంటున్నారు. నేడు మానుకోట జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో రైతులు సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు.
 
మిర్చి సాగు రకాలు..

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో పలు రకాల మిరపపంటను సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా తేజ, చపాటా, సింగిల్​హట్, 341 రకాలు సాగు చేస్తున్నారు. ఎకరాకు పెట్టుబడి రూ.70,000 నుంచి రూ.1.10 లక్షల వరకు ఖర్చు కాగా, పంట దిగుబడి ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు వస్తుందని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్​జిల్లా వ్యాప్తంగా 2024_ 25 సీజన్​లో 61,400 మంది రైతులు సుమారుగా 91,037 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. ఇందులో తేజ రకాన్ని అత్యధికంగా పండించారు. చపాటా 3,200 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఎనుమాముల మార్కెట్లో చపాటా మిర్చి క్వింటాకు రూ.26,100 ధర పలుకుతుంది. 

పరిశోధన కేంద్రం ఏర్పాటుతో ప్రయోజనాలు... 

మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుతో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రైతులకు సత్వరమే అందుబాటులోకి వస్తుంది. వివిధ విభాగాల శాస్త్రవేత్తలు అందుబాటులో ఉంటారు. శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పంటపొలాలను పరిశీంచి నిర్ధారణకు సలహాలు, సూచనలు అందిస్తారు. స్థానికంగా చీడపీడలను తట్టుకునే వంగడాలను రూపొందించడానికి అవకాశం ఉంటుంది.  ముఖ్యంగా చాపాటా మిర్చి సాగు చేసే రైతులకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం ఎకరాకు 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చే మిర్చి పంటలో దిగుబడులు పెరిగేలా పరిశోధనలు ఉంటాయని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రజాప్రతినిధులు, మానుకోట జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తేనే మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసుకోవచ్చని ఇక్కడి రైతులు కోరుతున్నారు. 

పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి

మానుకోట జిల్లాలో ప్రతి ఏడాది విరివిగా మిర్చి పంటను సాగు చేస్తున్నారు. ఉద్యానవన శాఖ ఆఫీసర్లు వివిధ పంటల పర్యవేక్షణ బాధ్యతలు ఉండటంతో సరైన సలహాలు, సూచనలు అందడం లేదు. మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుతో వివిధ రకాల తెగుళ్లకు సత్వరం సలహాలు అందుతాయి. నేరుగా రైతులు పురుగు మందులను పిచికారీ చేయడం మూలంగా ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలో వందల ఎకరాల్లో ప్రభుత్వం భూమి అందుబాటులో ఉన్నందున్న మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలవాలి.

దీకొండ కుమారస్వామి, మిర్చి రైతు, మాటేడు గ్రామం 

ఉమ్మడి జిల్లాలో 2024-25 మిర్చి సాగు విస్తీర్ణం ఎకరాల్లో...

జిల్లా    ఎకరాల్లో
మహబూబాబాద్    48234 
హనుమకొండ    6417
వరంగల్    9540
భూపాలపల్లి    18350
ములుగు    7280
జనగామ    1216