గ్రేటెస్ట్ ఆట ముగిసింది.. టెస్టులకు రిటైర్మెంట్‌‌‌‌ ఇచ్చిన విరాట్ కోహ్లీ

గ్రేటెస్ట్ ఆట ముగిసింది.. టెస్టులకు రిటైర్మెంట్‌‌‌‌ ఇచ్చిన విరాట్ కోహ్లీ
  • 14 ఏండ్ల కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఎన్నో ఘనతలు.. మోస్ట్ సక్సెస్‌‌‌‌ఫుల్ ఇండియా కెప్టెన్‌‌‌‌గా రికార్డు
  • టీ20ల హవాలో వన్నె తగ్గిపోతున్న టెస్టులకు తన ఆటతో జీవం పోసిన రక్షకుడు.
  • ఐదు రోజుల ఆట బోర్‌‌‌‌ కొడుతోంది అన్న పరిస్థితులను మార్చేసి.. అసలైన క్రికెట్ మజా టెస్టుల్లోనే ఉందని చాటి చెప్పిన మొనగాడు.

టెస్టు మ్యాచ్‌‌‌‌ను  డ్రా చేసుకుంటే చాలు అన్న పంథాను పక్కనబెట్టి ప్రతీ సెషన్‌‌‌‌ను ఆస్వాదిస్తూ.. ఆఖరి రోజు, చివరి బంతి వరకూ విజయం కోసం పోరాడవచ్చని చాటి చెప్పిన నాయకుడు.

14 ఏండ్ల పాటు తన ఆటతో, నాయకత్వ పటిమతో కొత్త తరానికి.. టెస్టులకు అసలైన  బ్రాండ్‌‌‌‌ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన వీరుడు ‘కింగ్‌‌‌‌’ విరాట్ కోహ్లీ తనకెంతో ఇష్టమైన లాంగ్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌కు అల్విదా చెప్పేశాడు..!  

వయసున్నా.. ఇంకా ఆడే సత్తా ఉన్నా.. పరుగుల ఆకలి తీరకపోయినా ‘టెస్టులు’ ఇక చాలనుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికే టీ20ల నుంచి తప్పుకున్న క్రికెట్‌ కింగ్ ఇండియా తరఫున ఇకపై వన్డేల్లోనే కనిపించనున్నాడు..! 

టెస్టు క్రికెట్‌లో ఓ సువర్ణాధ్యాయం ముగిసింది.  టీమిండియా మోస్ట్ సక్సెస్‌‌‌‌ఫుల్ టెస్ట్ కెప్టెన్‌‌‌‌, 14 ఏండ్లుగా ఈ ఫార్మాట్‌‌‌‌లో దుమ్మురేపుతున్న విరాట్ కోహ్లీ సైతం తన టీమ్‌‌‌‌మేట్‌‌‌‌ రోహిత్ శర్మ బాటలోనే నడిచాడు. టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్టు సోమవారం ప్రకటించాడు. ఈ నిర్ణయం అంత సులభం  కాకపోయినా.. తీసుకోవడం తప్పలేదని చెప్పి అభిమానులను నిర్వేదానికి గురి చేశాడు. 36 ఏండ్ల కోహ్లీ ఇండియా తరఫున 123 టెస్టులు ఆడి 9230 రన్స్ చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు ఉన్నాయి. ‘టెస్ట్ క్రికెట్‌‌‌‌లో తొలిసారి బ్యాగీ బ్లూ (ఇండియా క్యాప్‌‌‌‌) పెట్టుకొని14 ఏండ్లు గడిచాయి. 

ఈ ఫార్మాట్ నన్ను పరీక్షించింది, తీర్చిదిద్దింది, నాకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పింది. వైట్ జెర్సీలో ఆట వ్యక్తిగతంగా నాకెప్పుడూ ప్రత్యేక అనుభూతే. నిశ్శబ్దంగా కష్టపడటం, రోజుల తరబడి ఆడటం, ఎవరూ చూడని చిన్న క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడం సులభం కాదు, కానీ ఇది సరైన నిర్ణయం అనిపిస్తోంది. ఈ ఫార్మాట్ కోసం నేను చేయగలిగింది అంతా చేశాను. ప్రతిగా ఇది నేను ఊహించినదానికంటే ఎక్కువే తిరిగి పొందాను. 

అందుకే - ఈ ఆట కోసం, నాతో మైదానంలో కలిసి ఆడిన వారికి, నన్ను చూసిన ప్రతి ఒక్కరికి  కృతజ్ఞతలు తెలుపుతూ మనసు నిండా  సంతృప్తితో వైదొలుగుతున్నా. నా టెస్టు కెరీర్‌‌‌‌ను ఎప్పుడూ నవ్వుతూ గుర్తుచేసుకుంటాను’ అని కోహ్లీ తన ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌ పోస్టులో పేర్కొన్నాడు. 

విండీస్‌లో మొదలు.. ఆసీస్‌లో ముగింపు

2011లో వెస్టిండీస్ టూర్ లో ఇండియా 269వ టెస్టు ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా ఈ ఫార్మాట్‌‌‌‌లోఅరంగేట్రం చేసిన విరాట్ 14 ఏండ్ల కెరీర్‌‌లో  పరుగుల మోత మోగించడంతో పాటు తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. కెప్టెన్‌‌‌‌గా టీమిండియాను  జట్టును టెస్టు ర్యాంకింగ్‌‌‌‌లో నంబర్ వన్ స్థానానికి చేర్చాడు. 2018-–19లో ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని సాధించాడు. అతని నాయకత్వంలో ఇండియా 68 టెస్టుల్లో 40 విజయాలు సాధించింది. 42 నెలల పాటు ఇండియాను టెస్టుల్లో టాప్ ర్యాంకర్‌‌గా నిలిపాడు. దాంతో టెస్టులో మోస్ట్ సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌ ఇండియా కెప్టెన్‌‌‌‌గా మారాడు.  

ఓవరాల్‌‌‌‌గా గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్,  స్టీవ్ వా తర్వాత  నాలుగో అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌‌‌‌గా నిలిచాడు.  ఇండియా కెప్టెన్‌‌‌‌గా అత్యధికంగా 20 సెంచరీలు కొట్టి మరో రికార్డు సృష్టించాడు. తన నాయకత్వంలో స్వదేశంలో ఆడిన 11 సిరీస్‌ల్లో 11 గెలవడం విశేషం.  అయితే, గత నాలుగేండ్ల నుంచి తను క్రమంగా ఫామ్‌‌‌‌ కోల్పోయాడు. సౌతాఫ్రికాలో సిరీస్‌‌‌‌ ఓటమి తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. 

కెప్టెన్సీ భారం, దాని వల్ల వచ్చిన ఒత్తిడి తనపై ప్రతికూల ప్రభావం చూపిందన్న విరాట్ మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకే  అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌‌‌‌గా తప్పుకున్నానని కోహ్లీ స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో, ఆపై ఆస్ట్రేలియాలో తన చివరి టెస్టు సిరీస్‌‌‌‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఒక్క సెంచరీ మాత్రమే కొట్టిన అతను ఐదు మ్యాచ్‌‌‌‌ల్లో కలిపి 190 రన్స్ మాత్రమే చేశాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాపై విరాట్ చివరి టెస్టు ఆడిన కోహ్లీ... రోహిత్ మాదిరిగా ఫేర్‌‌వెల్‌ మ్యాచ్ లేకుండా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు.

టెస్టు క్రికెట్‌‌లో ఒక యుగం ముగిసింది.  కానీ ఆ వారసత్వం ఎప్పటికీ కొనసాగుతుంది!  ఇండియా మాజీ  కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. టీమిండియాకు తను చేసిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయి- బీసీసీఐ

విరాట్ నీ నిజమైన వారసత్వం లెక్కలేనంత మంది యువ క్రికెటర్లను ఈ ఆటలోకి వచ్చేలా స్ఫూర్తినిచ్చింది. అద్భుతమైన టెస్టు కెరీర్‌‌ నీది. నువ్వు ఇండియాకు  పరుగులు కంటే ఎక్కువగా ఒక కొత్త తరం ఉత్సాహవంతమైన అభిమానులను, ఆటగాళ్లను అందించావు. ఒక ప్రత్యేకమైన టెస్టు కెరీర్‌‌కు అభినందనలు.
-సచిన్ టెండూల్కర్‌‌‌‌

అద్భుతం అతని ప్రస్థానం..

సాధారణంగా ఒక మేటి ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఒక ఫార్మాట్‌‌‌‌లో మంచి రికార్డు ఉంటుంది. కానీ, విరాట్ కోహ్లీ అందరిలో ప్రత్యేకం. తను మూడు ఫార్మాట్లలోనూ మేటి ప్లేయరే. అందునా టెస్టు ఫార్మాట్‌‌‌‌ తనకు ఎంతో ఇష్టమైన ఆట. వైట్ డ్రెస్సులో.. పేసర్ల చేతుల్లో నుంచి మెరుగు వేగంతో దూసుకొచ్చే ఎరుపు బంతులను కళాత్మక షాట్లతో  బౌండ్రీకి తరలించడం కోహ్లీకి ఎంతో ఇష్టం. స్లో ట్రాక్స్‌‌‌‌పై గిర్రున తిరిగే స్పిన్ బాల్స్‌‌‌‌నూ అంతే నేర్పుగా  ఆడటం ఇంకా ఇష్టం. ఐదు రోజులు.. 15 సెషన్ల పాటు ఒక ఆటగాడికి శారీరకంగానే, మానసికంగా పరీక్ష పెట్టే ‘టెస్టు’లను ఎదుర్కోవడం.. అందులో డిస్టింక్షన్‌‌‌‌లో పాసవ్వడం  కోహ్లీకి అలవాటు. 

చీకూగా వచ్చి కింగ్‌‌‌‌గా మారి

వన్డే వరల్డ్ కప్‌‌‌‌ అందుకున్న 2011లోనే వెస్టిండీస్‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌లో టెస్టు అరంగేట్రం చేసిన కోహ్లీ ప్రస్థానం 2025 వరకూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ సాగింది. వెస్ట్‌‌‌‌ ఢిల్లీ కుర్రాడిగా.. సీనియర్లు ముద్దుగా  పిలిచే ‘చీకూ’గా టీమ్‌‌‌‌లోకి వచ్చిన విరాట్ తన ఆటతో కింగ్‌‌‌‌గా మారే వరకూ సాగిన తన ప్రయాణంలో ఎన్నో విజయాలు, మరో రికార్డులకు తోడు చిరకాలం గుర్తిండిపోయే జ్జాపకాలను ఇండియాకు అందించాడు.. తన అత్యద్భుత బ్యాటింగ్‌‌‌‌, కెప్టెన్‌‌‌‌గా తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు.. ఆస్ట్రేలియన్లను వాళ్లగడ్డపైనే వణికించిన తీరు పనైపోతుందని అనుకున్న ఈ ఫార్మాట్‌‌‌‌తో అభిమానులు ప్రేమలో పడిపోయేలా చేశాయనడంలో సందేహం లేదు. టీ20ల జమానాలో టెస్టులకు కొత్త తరం అభిమానులను అందించిన ఘనతా కోహ్లీకే చెందుతుంది. 

ఇంగ్లండ్‌‌‌‌, ఆస్ట్రేలియాలో మొనగాడిలా..

సొంతగడ్డపై టన్నుల కొద్దీ రన్స్ చేసిన టీమిండియా క్రికెటర్లు ఇంగ్లండ్‌‌‌‌, ఆస్ట్రేలియాకు వెళ్లగానే తడబడుతుంటారు. కానీ, కోహ్లీ ఈ రెండు దేశాల్లోనూ తన మార్కు చూపెట్టాడు. 2014– 2019 వరకు ఈ ఫార్మాట్‌‌‌‌లో తనకు తిరుగేలేదు. 2014 ఇంగ్లండ్ టూర్‌‌‌‌‌‌‌‌లో జేమ్స్ అండర్సన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ స్టంప్ బాల్స్‌‌‌‌ను వెంటాడి వికెట్‌‌‌‌ పారేసుకొని విమర్శలు ఎదుర్కొన్న తర్వాత కోహ్లీలో కసి పెరిగింది. తన లోపాలను సరిదిద్దుకున్న కోహ్లీ కొన్ని నెలల తర్వాత ఆస్ట్రేలియా టూర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి నాలుగు సెంచరీ కొట్టేశాడు. 

అప్పుడే ఈ ఫార్మాట్‌‌‌‌లో విరాట్ విశ్వరూపం మొదలైంది.  2018లో ఇంగ్లండ్‌‌‌‌కు తిరిగొచ్చి  593 రన్స్ చేశాడు. 2014 నాటి చేదు జ్ఞాపకాలకు బదులు తీర్చుకున్నాడు. ఇక,  కెప్టెన్‌‌‌‌గా బాధ్యతలు అందుకున్న కోహ్లీ అందులోనూ తనమార్కు చూపెట్టాడు. అంతకుముందు వరకూ విదేశాల్లో టెస్టులను డ్రా చేసుకుంటే చాలు అన్న పరిస్థితులను పూర్తిగా మార్చేశాడు. ఇంట కాదు  ఎట్టి పరిస్థితుల్లోనైనా రచ్చ గెలవాల్సిందే అని నమ్మి.. తన తోటి ప్లేయర్లలోనూ విజయకాంక్షను నిలిపాడు. అప్పటిదాకా స్పిన్ బలంపైనే ఆధారపడిన జట్టు ‘పేస్’ పవర్ పెంచాడు. 

బుమ్రా, షమీ, ఇషాంత్‌‌‌‌, ఉమేశ్ యాదవ్ వంటి పేసు గుర్రాలతో ప్రత్యర్థి బ్యాటర్లలో వణుకు పుట్టించాడు. పరాయి గడ్డపై ఆ జట్టు ఆటగాళ్ల కండ్లలో కన్ను పెట్టి చూసే ధైర్యం చేశాడు. టెస్టు ఫార్మాట్‌‌‌‌లో స్లెడ్జింగ్‌‌‌‌తో ప్రత్యర్థులపై మానసిక దాడి చేయడం ఆస్ట్రేలియన్లకు అలవాటు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు.. కంగారూలకు నోటితోనే బతులిచ్చిన విరాట్ 2018–19లో ఆసీస్ గడ్డపై తొలిసారి ఇండియాకు బోర్డర్‌‌‌‌‌‌‌‌–గావస్కర్ ట్రోఫీ సాధించి పెట్టాడు.  2021లో కెప్టెన్‌‌‌‌గా లార్డ్స్‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌పై టెస్టు విజయం,  ఒక దశలో 18 నెలల కాలంలో ఆరు డబుల్ సెంచరీలు కొట్టడం వంటి ఎన్నో మధుర ఘట్టాలు కోహ్లీ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. 

ఏదైమైనా..కోహ్లీ–టెస్టు ఫార్మాట్‌‌‌‌ది విడదీయరాని సంబంధం. కోహ్లీ టెస్టులను ప్రేమిస్తే.. ఆ ఫార్మాట్ తనతో ప్రేమలో పడింది. అప్పటికే సచిన్ టెండూల్కర్‌‌‌‌ లాంటి ఓ మెగాస్టార్ ఉన్న దశలో టెస్టుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఈ ఫార్మాట్‌‌‌‌లో డిస్టింక్షన్ కొట్టడం  కోహ్లీ అందుకున్న అతి పెద్ద ఘనతగా చెప్పొచ్చు. కోహ్లీ టెస్టులకు దూరమైనా.. ఈ ఫార్మాట్‌‌‌‌పై తను వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. ఇప్పుడు క్రికెట్ అంతా టీ20ల చుట్టూ తిరుగుతుండగా క్రికెట్‌‌‌‌లో అత్యుత్తమ ఫార్మాట్‌‌‌‌కు అతనే  చిట్ట చివరి మెగాస్టార్‌‌‌‌‌‌‌‌గా నిలిచిపోతాడు

అలసిపోయాడా...

36 ఏండ్ల వయసులోనూ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ పరంగా అందరికంటే ముందున్న విరాట్ కోహ్లీలో మరో మూడు నాలుగేండ్ల ఆట మిగిలుంది.  పైగా గతేడాది టీ20 వరల్డ్ కప్‌‌‌‌ అందుకున్న అతను ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీ (వన్డే)లోనూ బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా సత్తా చాటాడు. ఐపీఎల్‌‌‌‌లోనూ అదరగొడుతున్నాడు. ఈ లెక్కన కనీసం 2027 వరల్డ్ టెస్టు చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ ఫైనల్ వరకూ తను ఈ ఫార్మాట్‌లో ఆడతాడని అభిమానులు కోరుకున్నారు.  కానీ, ఉన్నట్టుండి లాంగ్ ఫార్మాట్‌‌‌‌ నుంచి తప్పుకోవడం సహజంగానే అందరినీ ఆశ్చర్యపరిచిందిపైగా కనీసం ఫేర్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ ఆడకుండానే వైదొలగాల్సిన అవసరం ఏముంది? అనేది అందరిలో ఉన్న ప్రశ్న. 

కోహ్లీ గత కొన్నాళ్లుగా రెడ్ బాల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. సొంతగడ్డపై న్యూజిలాండ్‌‌‌‌తో సిరీస్‌‌‌‌తో పాటు బోర్డర్‌‌‌‌‌‌‌‌–గావస్కర్ ట్రోఫీలో నిరాశపరిచాడు. సిడ్నీలో తన చివరి టెస్టులో 17, 6 రన్స్ మాత్రమే చేశాడు. కానీ, ఇలాంటి పరిస్థితులు గతంలో ఎదురైనా వాటి నుంచి గొప్పగా పుంజుకున్న విరాట్ వచ్చే నెల ఇంగ్లండ్‌‌‌‌లో ఐదు టెస్టుల సిరీస్‌‌‌‌లో ఆడతాడని అంతా ఆశించారు. కానీ, ప్రస్తుతం తను అలసిపోయినట్టున్నాడు. ఈ మధ్య తన కుటుంబానితో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడుతున్న కోహ్లీ.. ఇంగ్లండ్‌‌‌‌లో మరో కఠిన సవాల్‌‌‌‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేనట్టున్నాడు. 

అదొక్కటే లోటు..

వన్డే, టీ20 ఫార్మాట్లలో కోహ్లీ అన్ని ఐసీసీ ట్రోఫీలను అందుకున్నాడు. వన్డే, టీ20 వరల్డ్ కప్‌లతో పాటు చాంపియన్స్ ట్రోఫీ కూడా అందుకున్నాడు. కానీ, తనకెంతో ఇష్టమైన టెస్టుల్లో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) టైటిల్ అందుకోకపోవడం తన కెరీర్‌‌లో లోటు. కెప్టెన్‌గా, ప్లేయర్‌‌గా వరుసగా రెండు సార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడినా ట్రోఫీని ముద్దాడలేకపోయాడు.

సొంతగడ్డపై చివరి ఇన్నింగ్స్‌‌‌‌..

2006లో రంజీ ట్రోఫీ ఆడుతుండగా తన తండ్రి అంత్యక్రియలను నిలిపివేసి మరీ ఆడిన విరాట్‌‌‌‌ 90 రన్స్‌‌‌‌ చేశాడు. ఢిల్లీని ఫాలోఆన్‌‌‌‌ నుంచి తప్పించి నేరుగా స్మశానానికి వెళ్లాడు. నాడు ఖాళీగా ఉన్న ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో యంగ్ కోహ్లీ ఆడిన ఆ ఇన్నింగ్స్‌‌‌‌ ఆటపై అతని ఉన్న ప్రేమను, నిబద్ధతను చూపించింది. ఈ ఏడాది జనవరిలో అదే కోట్లా స్టేడియంలో కోహ్లీ లాంగ్ ఫార్మాట్‌‌‌‌లో ఆఖరి ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి రంజీ మ్యాచ్‌‌‌‌ అయినప్పటికీ  కింగ్ కోహ్లీ కోసం దాదాపు 20 వేల మంది ఫ్యాన్స్‌‌‌‌తో స్టేడియం కిక్కిరిసింది. సొంతగడ్డపై తన చివరి ఫస్ట్ క్లాస్  ఇన్నింగ్స్ ఆడిన విరాట్‌‌‌‌.. 6 రన్స్ మాత్రమే చేశాడు.