పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇక ఉద్యోగం మారినప్పుడు డబ్బు ఆటో ట్రాన్స్‌ఫర్!

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇక ఉద్యోగం మారినప్పుడు డబ్బు ఆటో ట్రాన్స్‌ఫర్!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది ఉద్యోగులు  EPFOలో సభ్యులుగా ఉన్నారు. చాలా మందికి EPF కేవలం రిటైర్మెంట్ సేవింగ్స్ మాత్రమే కాదు.. వారి తొలిపాటి పెట్టుబడి ప్రయాణం కూడా. కానీ ఇప్పటివరకు ఉద్యోగం మారిన ప్రతిసారీ పీఎఫ్ మొత్తాల బదిలీ ప్రక్రియ అనేది చాలా మందికి తలనొప్పిగా ఉండేది. పాత యజమాని సహకారం లేకపోవడం, తప్పుడు వివరాలు, UAN డూప్లికేషన్ వంటి సమస్యలు ఆలస్యాలకు కారణం అయ్యేవి. కానీ ఇప్పుడు ఈ సమస్యలకు కొత్త పరిష్కారం తీసుకొస్తోంది ఈపీఎఫ్ఓ సంస్థ. కొత్త రూల్స్ వల్ల పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ మరింత సులభంగా, వేగంగా, ఆటోమేటిక్‌గా జరగబోతోంది. 

1. ఆటోమేటిక్ పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ ఫార్మ్ 13 మార్పు:
ఇప్పటివరకు ఉద్యోగులు కొత్త కంపెనీలో చేరిన తరువాత Form 13 ద్వారా బదిలీకి అప్లై చేసేవారు. ఇకపై ఆ అవసరం లేదు. కొత్త ఉద్యోగి వివరాలు సిస్టమ్‌లో అప్‌డేట్ అయిన వెంటనే.. PF బదిలీ ఆటోమేటిక్‌గా ప్రారంభమవుతుంది. కొత్త కంపెనీ HR లేదా పాత యజమాని నుంచి అఫ్రూవల్ కూడా అవసరం ఉండదు.

2. ఒకే UANతో డూప్లికేషన్‌కు చెక్:
చాలా మంది ఉద్యోగులు పొరపాటున అనేక UANలకు కారణమయ్యేవారు. ఇప్పుడు EPFO ఈ సమస్యను పూర్తిగా ఆపింది. ఆధార్ ఆధారిత ఆథరైజేషన్ వల్ల ఒకసారి సృష్టించిన UAN మళ్లీ రిజిస్టర్ కావడం జరగదు. కొత్త కంపెనీలో పీఎఫ్ అకౌంట్లు అదే UANకు లింక్ చేయబడి కేవలం పాస్ బుక్ జనరేట్ చేయబడుతుంది.

3. ఆధార్ + e-KYCతో వేగవంతమైన ప్రాసెసింగ్:
గతంలో ఉద్యోగదారుల సంతకాలు, తేదీల పొరపాట్లు కారణంగా ట్రాన్స్ ఫర్ నెలల తరబడి పెండింగ్‌లో ఉండేవి. ఇప్పుడు ఆధార్ ఆధారిత e-Sign, KYC ఆటో వెరిఫికేషన్ సిస్టమ్ వల్ల 7–10 రోజుల్లోనే బదిలీ పూర్తవుతుంది.

4. పాస్‌బుక్‌లో కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్:
పాత అకౌంట్‌లోని బ్యాలెన్స్‌ని కొత్తదానితో పోల్చడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ పూర్తయ్యాక పాత అకౌంట్ “జీరో బ్యాలెన్స్” చూపిస్తుంది. కొత్త పాస్‌బుక్‌లో మొత్తం కలిపిన బ్యాలెన్స్ కనబడుతుంది.

5. ఎగ్జిట్ డేట్ అప్‌డేట్ తప్పనిసరి:
పాత కంపెనీ ఎగ్జిట్ డేట్ అప్‌డేట్ చేయకపోవడం PF బదిలీని అడ్డుకునేది. ఇప్పుడు EPFO ఈ రూల్‌లో కీలక మార్పు చేసింది. దీంతో పాత యజమాని వివరాలు అప్‌డేట్ చేయకపోతే ఉద్యోగి ఆధార్ OTP వెరిఫికేషన్ సహాయంతో స్వయంగా దీన్ని పూర్తి చేయవచ్చు.

6. ట్రాన్స్‌ఫర్ సమయంలో వడ్డీ ఆగదు:
ముందుగా బదిలీ ప్రక్రియ ఎక్కువ రోజులు సాగితే వడ్డీ ఆగిపోయేది. ఇకపై ట్రాన్స్‌ఫర్ పూర్తి అయ్యే వరకు వడ్డీ కొనసాగుతుంది. ఇలా ఉద్యోగి రిటైర్మెంట్ ఫండ్ నిరంతరంగా పెరుగుతూనే ఉంటుంది. అందువల్ల కొత్త మార్పులతో PF బదిలీ ప్రక్రియ నిజంగానే సులభమవుతోంది.