రాజస్థాన్, కర్నాటక రాజ్యసభ ఎన్నికల రిజల్ట్ విడుదల

రాజస్థాన్, కర్నాటక రాజ్యసభ ఎన్నికల రిజల్ట్ విడుదల
  • మహారాష్ట్ర, హర్యానా ఫలితాలు పెండింగ్ 
  • మొత్తం 4 రాష్ట్రాల్లోని 16 సీట్లకు పోలింగ్ పూర్తి
  • మరో 9 రాష్ట్రాల్లో 41 సీట్లు ఏకగ్రీవం

న్యూఢిల్లీ:  నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ ముగిసింది. రాత్రి వరకూ రాజస్థాన్, కర్నాటకలోని మొత్తం 8 సీట్లకు రిజల్ట్ ను ఎన్నికల సంఘం(ఈసీ) విడుదల చేసింది. రాజస్థాన్ లో రూలింగ్ పార్టీ కాంగ్రెస్ 3 సీట్లను, ప్రతిపక్ష బీజేపీ 1 సీటును గెలుచుకున్నాయి. కర్నాటకలో రూలింగ్ పార్టీ బీజేపీ 3 సీట్లను, ప్రతిపక్ష కాంగ్రెస్ 1 సీటును గెలుచుకున్నాయి. అయితే, ఎన్నికల రూల్స్ ఉల్లంఘన జరిగిందన్న ఫిర్యాదులు అందడంతో మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలను ఈసీ పెండింగ్ లో పెట్టింది. ఈ రెండు రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్, అనధికారిక వ్యక్తులకు బ్యాలెట్ పేపర్లను చూపారని వచ్చిన ఫిర్యాదులను ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు.  రాజస్థాన్ లో బీజేపీ మద్దతుతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన జీ టీవీ చైర్మన్ సుభాష్ చంద్ర 11 ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాజస్థాన్ లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు 41 ఓట్లు అవసరం కాగా.. సుభాష్ కు బీజేపీ నుంచి 27, ఆర్ఎల్పీ నుంచి 3 ఓట్లు పడ్డాయి. అయితే, బీజేపీకి 71 ఓట్లు ఉండగా.. కొందరు కాంగ్రెస్ కు క్రాస్ ఓటింగ్ వేశారు. కాగా, మొత్తం 15 రాష్ట్రాల్లోని 57 సీట్లకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఆయా రాష్ట్రాల్లో పార్టీలకు ఉన్న బలాబలాలను బట్టి.. 41 సీట్లు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా నాలుగు రాష్ట్రాలు మహారాష్ట్ర (6), రాజస్థాన్ (4), కర్నాటక (4), హర్యానా (2)లో 16 సీట్లకు శుక్రవారం పోలింగ్ జరిగింది. వీటిలో రాజస్థాన్, కర్నాటక రిజల్ట్ విడుదల కాగా.. మహారాష్ట్ర, హర్యానా ఫలితాలు రావాల్సి ఉంది.