167 అంబులెన్స్ లను ప్రారంభించిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

167 అంబులెన్స్ లను ప్రారంభించిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

జైపూర్:  జై శ్రీరామ్ నినాదాన్నిబీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఆ నినాదాన్ని వాడుకొని దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి, భయాందోళనలు సృష్టించే ప్రయత్నంలో బీజేపీ ఉందన్నారు.  భారత్ జోడో యాత్ర ద్వారా ఇలాంటి విభజన రాజకీయాల గురించి రాహుల్ గాంధీ దేశ ప్రజలకు వివరిస్తున్నారని చెప్పారు. పొంచి ఉన్న కొవిడ్ ముప్పును  ఎదుర్కొనేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నామని అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. ఈక్రమంలోనే ఇవాళ 167 ఎమర్జెన్సీ అంబులెన్స్ లను ప్రారంభించినట్లు చెప్పారు.  

ఈకార్యక్రమంలో మాట్లాడిన సీఎం అశోక్ గెహ్లాట్..  కేంద్రంలోని బీజేపీ పాలకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆరోగ్య బీమా కవరేజీ జాతీయ సగటు కంటే రాజస్థాన్ లోనే ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు.ఆరోగ్య బీమా కవరేజీకి సంబంధించి జాతీయ సగటు కేవలం 41 శాతమేనని.. ఇది రాజస్థాన్ లో 90 శాతం ఉందని వివరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర లో 22.4 శాతం, ఉత్తరప్రదేశ్ లో 15.9 శాతం మాత్రమే ఆరోగ్య బీమా కవరేజీ ఉందని గెహ్లాట్ అన్నారు. వైద్యసేవల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను తాము అధిగమించామని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ అనేక ఆటలు ఆడుతోందని తెలిపారు.