
రాజస్థాన్ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత జగన్నాథ్ పహాడియా (89) కరోనాతో మృతిచెందారు. పహాడియా కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. దాంతో ఆయనకు రాజస్థాన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కానీ ఆయన ఆరోగ్యం విషమించడంతో బుధవారం రాత్రి కన్నుమూశారు.
పహాడియా మరణం పట్ల భారత ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. పహాడియా మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. పహాడియా కుటుంబ సభ్యులకు, అభిమానులకు మోడీ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీనియర్ రాజకీయ నేతగా, పాలనాధికారిగా భవిష్యత్ తరాల కోసం పహాడియా ఎంతో కృషి చేశారని మోడీ అన్నారు. రాజస్థాన్ ఓ మంచి నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పహాడియా మృతి పట్ల రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
పహాడియా 1980-81లో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత బీహార్, హర్యానాలకు గవర్నర్‌గా కూడా పనిచేశారు. రాజస్థాన్‌కు మొదటి దళిత ముఖ్యమంత్రిగా పహాడియాకు పేరుంది. పహాడియా మృతికి సంతాపంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించింది.