ఓ భర్త కసి, కోపం : ఇదుగో.. ఈ చిల్లర తీసుకుని పండగ చేసుకో

ఓ భర్త కసి, కోపం : ఇదుగో.. ఈ చిల్లర తీసుకుని పండగ చేసుకో

కలిసి ఉన్నప్పుడు కాదు విడిపోయిన సమయంలో కూడా భార్యను టార్చర్ చేశాడు భర్త. భరణం కింద ఇవ్వాల్సిన డబ్బులను చిల్లరగా తీసుకు వచ్చి వాటిని తీసుకోవాలంటూ చిల్లర వేషాలు వేసేందుకు ప్రయత్నించాడు. కోర్టు అతడి తీరును చూసి.. భర్తకు వాత పెట్టే తీర్పునిచ్చింది..

రాజస్థాన్ కోర్టులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ భర్తపై వరకట్నం కేసు పెట్టింది. విడాకులు మంజూరు చేసి ..భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలని కోర్టుకెక్కింది. ఈ కేసు పెండింగ్ లో ఉంగడా...తుది తీర్పు వచ్చే వరకు  భార్యకు నెలకు రూ. 5 వేల చొప్పున భరణంగా చెల్లించాలని భర్తకు సూచిస్తూ కోర్టు మధ్యంతర తీర్పు ఇచ్చింది. అయితే 11 నెలలు గడిచినా భర్త భరణం సొమ్ము ఇవ్వడం లేదంటూ ఆయన భార్య మళ్లీ కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో భర్త .. భార్యకు భరణం ఇచ్చేందుకు ఏకంగా ఏడు బస్తాల చిల్లర నాణాలను పట్టుకొచ్చాడు. అవన్నీ రూపాయి, రెండు రూపాయల నాణాలు .  అవి మొత్తం 280కిలోల బరువున్నాయి. దీంతో జడ్జి షాక్ కు గురయ్యారు. 

వివరాల్లోకి వెళ్తే... 

రాజస్తాన్‌లోని జైపూర్‌ హర్మదా ప్రాంతానికి చెందిన దశరథ్‌ కుమావత్, భార్య సీమలకు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన 3-,4 ఏళ్ల నుంచి  గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతొ విడాకులు కోసం కోర్టును ఆశ్రయించారు. ఆ కేసుపెండింగ్ లో ఉండగా అప్పటి వరకు ఆమె జీవనభృతి కింద ప్రతి నెల రూ. 5వేలు ఇవ్వాలని తీర్పునిచ్చింది. అయితే 11 నెలల నుంచి భరణం చెల్లించకపోవడంతో సీమ కోర్టును ఆశ్రయించింది. దీంతో భర్త దశరథ్‌కు రికవరీ వారెంట్ జారీ చేసింది. అయినప్పటికీ అతడు డబ్బులు చెల్లించేందుకు నిరాకరించడంతో అరెస్టు వారెంట్ జారీ చేసింది.

చిల్లర రూపంలో...  ఏడు బస్తాల్లో... 

పోలీసులు దశరథ్ ను  అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ సమయంలో అతని కుటుంబ సభ్యులు ఆ డబ్బును.. చిల్లర రూపంలో ఏడు బస్తాల్లో తీసుకు వచ్చి అప్పగించగా..భార్య సీమఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ డబ్బు తీసుకునేందుకు నిరాకరించింది. ఈ కరెన్సీ చెల్లుబాటులో ఉందని  తీసుకోవాలంటూ భార్యను టార్చర్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే నాణేల రూపంలో దశరథ్ తీసుకువచ్చిన డబ్బులను తీసుకోవాలని సీమాను కోర్టు ఒప్పించింది. అయితే ఇక్కడే మరో తిరకాసు పెట్టింది. ఆ 7 సంచుల చిల్లర నాణేలను దశరథ్ ఒక్కడే లెక్కపెట్టాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను జూన్‌ 26 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి వరకు ఆ 7 సంచుల చిల్లర నాణేలు కోర్టు ఆధీనంలోనే ఉంటాయని స్పష్టం చేసింది. జూన్ 26 తేదీ రోజున ఆ డబ్బును దశరథ్‌ లెక్కించి రూ.1000 చొప్పున ఒక్కో ప్యాకెట్‌గా కట్టి పెట్టాలని సూచించింది.  కోర్టు సమక్షంలోనే ఆయన భార్య సీమాకు అందజేయాలి అని జడ్జి స్పష్టం చేశారు. కోర్టు లో భార్యకు ఝలక్ ఇవ్వాలని భావించిన భర్తకు.. జడ్జి మంచి శిక్ష విధించారని విషయం తెలిసిన వాళ్లు అంటున్నారు.