కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాజస్థాన్ లో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఆ రాష్ట్ర రాజధాని జైపూర్ సహా జోధ్ పూర్, కోట మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఏప్రిల్ 5వ తేదీన జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికలను ఏప్రిల్ 18 లోపు పూర్తి చేయాలని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)ని రాజస్థాన్ హైకోర్టు గత నెలలో ఆదేశించింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం లాక్ డౌన్ అమలు చేస్తుండడంతో ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఎస్ఈసీ కోర్టును ఆశ్రయించారు. అందుకు అనుమతించిన కోర్టు ఆరు వారాల సమయం ఇచ్చింది. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ వీలుకాదని, ఆగస్టు చివరి వరకు వాయిదా వేయాలని కోరుతూ శనివారం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆగస్టు చివరి వరకు మున్సిపల్ ఎన్నికల వాయిదాకు అనుమతి ఇచ్చింది.
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 29,974 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 937 మంది మరణించగా.. 7027 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 8590 మంది కరోనా బారినపడ్డారు. ఈ రాష్ట్రంలో 369 మంది మరణించగా.. 1282 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గుజరాత్ లో 3548, ఢిల్లీలో 3108, మధ్యప్రదేశ్ లో 2368 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్ లో 2262 మంది కరోనా బారినపడ్డారు. అందులో 46 మంది మరణించగా.. 669 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Rajasthan: Election process in Municipal Corporations of Jaipur, Jodhpur and Kota have been postponed till the end of August, in wake of #Coronavirus outbreak.
— ANI (@ANI) April 28, 2020
