సెక్రటేరియెట్కు ప్రధాన ఆకర్షణగా రాజస్థాన్ రెడ్ మార్బుల్

సెక్రటేరియెట్కు ప్రధాన ఆకర్షణగా రాజస్థాన్ రెడ్ మార్బుల్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సెక్రటేరియెట్ కు రాజస్థాన్ రెడ్ మార్బుల్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పార్లమెంట్ తరహాలో సెక్రటేరియెట్ గోడలకు రెడ్ సాండ్ మార్బుల్ అమర్చుతున్నారు. రాజస్థాన్​లోని కరోలి, జోధ్​పూర్ ప్రాంతాల్లో అధికారుల బృందం 5, 6 క్వారీలను పరిశీలించి ఈ మార్బుల్ ను ఎంపిక చేసింది. ఇప్పటి వరకు  రాజస్థాన్​ నుంచి 55 లారీల్లో 3వేల క్యూబిక్ మీటర్లలో మార్బుల్​ను తరలించారు. అన్ని ఫ్లోర్లలో ఎక్కడా నీళ్లు నిలవకుండా జర్మన్​టెక్నాలజీని ఉపయోగించి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పా టు చేస్తున్నామని వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు. దసరాకు సెక్రటేరియెట్ మెయిన్ బిల్డింగ్ ఓపెన్ చేసేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. 25 ఎకరాల్లో 8.70 లక్షల చదరపు అడుగుల్లో సెక్రటేరియెట్ భవనం నిర్మిస్తున్నారు. అందులో 7 లక్షల చదరపు అడుగుల్లో మెయిన్ బిల్డింగ్ ఉండగా, మిగతా ప్రాంతంలో ఫైర్ స్టేషన్, గుడి, చర్చ్ , మసీదు, పోలీస్ క్వార్టర్స్ నిర్మిస్తున్నారు. ఒక్కో ఫ్లోర్ లో ముగ్గురు మంత్రుల చాంబర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ చాంబర్, కాన్ఫరెన్స్ హాల్ ఇలా 90 వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. మొత్తం 25 మంది మంత్రులకు సరిపోయేలా చాంబర్లు కడుతున్నారు. 1600 మంది కార్మికులు రోజూ15 గంటల పాటు పనిచేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. త్వరలో మరో 400 మంది కార్మికులు నైట్ డ్యూటీలో పనుల్లో చేరుతారని తెలిపారు.

ప్రజలకు అందుబాటులో ప్రార్థనా మందిరాలు
సెక్రటేరియెట్ బయట అమృత క్యాసిల్​హోటల్ వైపు గుడి కడుతున్నారు. మింట్ కాంపౌండ్ వైపు చర్చ్, మసీదు నిర్మిస్తున్నారు. ఈ మూడింటికి పబ్లిక్ వచ్చి వెళ్లేందుకు 40 ఫీట్ల రోడ్ వేస్తున్నారు.  సెక్రటేరియెట్ చుట్టూ సుమారు 10 మీటర్ల ఎత్తైన గోడ నిర్మిస్తున్నారు. ఇక సీఎం కార్యాలయమే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కొత్త సెక్రటేరియట్‌‌లో సీఎం ఆఫీస్ ను ఆరో ఫ్లోర్ లో  నైరుతిలో  కడుతున్నారు. సీఎంవో విండోలకు బుల్లెట్ ఫ్రూప్ గ్లాస్ లను అమర్చనున్నామని ఆర్అండ్ బీ అధికారులు చెబుతున్నారు. ఆరో ఫ్లోర్​లో సీఎంఓ, క్యాబినెట్‌‌ మీటింగ్‌‌ హాల్‌‌, సీఎస్​ ఆఫీసులు ఉంటాయి. 

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్మాణం
కొత్త సెక్రటేరియట్‌‌ను రాష్ట్రంలోని ముఖ్యమైన కళాకృతుల ప్రతిబింబాలతో నిర్మిస్తున్నారు. 33 జిల్లాల సంస్కృతి, సాంప్రదాయాలను, కళలను ప్రతిబింబించేలా సచివాలయ గోడలపై చిత్రాలు, క్యారికేచర్లు వేయనున్నారు. భవనం మధ్యలో ల్యాండ్‌‌ స్కేప్‌‌ ఆకారంలో పెద్ద ఫౌంటెయిన్‌‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సెక్రటేరియెట్  లోపలి ప్రాంతమ౦తా పచ్చటి వాతావరణంతో కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 12 ఎకరాలకు పైగా (50 శాతం) గార్డెన్‌‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఒకేసారి 650 కార్లు, 500 బైకులు పార్కింగ్‌‌ చేసుకునేలా ప్రణాళిక వేశారు.