జైపూర్: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ‘స్కూల్ ఠీక్ కరో’ ఆందోళనల నేపథ్యంలో రాజస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 41 జిల్లాల్లో ప్రభుత్వ స్కూల్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.12,500 కోట్లు రిలీజ్ చేసింది. రాష్ట్రంలో 611 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవని, మరో 2,000 పైగా పాఠశాలల్లో టాయిలెట్ ఫెసిలిటీ లేదని అంగీకరిస్తూ, ఈ పనులకు సంబంధించిన సమగ్ర బ్లూప్రింట్‌ను విడుదల చేసింది.
ఈ ఆధునికీకరణ పనులను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభిస్తామని తెలిపింది. కేటాయించిన నిధుల్లో 3,587 కొత్త స్కూల్ భవనాల నిర్మాణం కోసం రూ.2,487 కోట్లు, 83 వేల అదనపు క్లాస్‌రూంల నిర్మాణానికి రూ. 8,378 కోట్లను వెచ్చించనున్నారు. అలాగే 22 వేలకుపైగా పాఠశాలల్లో మరమ్మతుల కోసం రూ. 1,129 కోట్లు, 13 వేల కొత్త మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ. 340 కోట్లను వెచ్చించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
