MI vs RR: ఐపీఎల్ 2026 (IPL 2026) ప్లేఆఫ్స్ బెర్త్‌ను తేల్చే ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్లు ముంబై ఇండియన్స్ (MI) బౌలర్లను పట్టుకొని పొట్టు పొట్టు కొట్టిండ్రు. వాంఖడే స్టేడియంలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. ఇన్నింగ్స్ మధ్యలో వరుస వికెట్లు కోల్పోయి కొంచెం తడబడినప్పటికీ.. గట్టిగ నిలబడి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. పంజాబ్, రాజస్థాన్ జట్ల ప్లేఆఫ్స్ పంచాయితీ తేలాలంటే గిప్పుడు ముంబై టీమ్ ఎట్లనైనా 206 పరుగులు కొట్టాలి.
ఆరంభంలోనే గట్టి షాక్:
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్థాన్‌కు ఆరంభంలోనే ముంబై బౌలర్లు గట్టి షాక్ ఇచ్చిండ్రు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి దూకుడుగా ఆడిండు. కేవలం 17 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లతో 27 రన్స్ చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో కార్బిన్ బోష్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరో ఎండ్‌లో ఉన్న యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (4) దీపక్ చాహర్ వేసిన అద్భుతమైన బంతికి నమన్ ధీర్‌కు క్యాచ్ ఇచ్చి దొరికిపోయిండు. ఆ వెంటనే వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్ (14) కొన్ని బౌండరీలతో చెలరేగినప్పటికీ.. ఏఎం ఘజన్‌ఫర్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి డగౌట్‌కు చేరాడంతో రాజస్థాన్ ఫ్యాన్స్‌కు కొంచెం టెన్షన్ పట్టుకుంది.
మిడిల్ ఆర్డర్ పోరాటం:
టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ కి వచ్చినోళ్లు జట్టును అద్భుతంగా ఆదుకున్నారు. దాసున్ శనక (29) తన కిరాక్ బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును ఉరుకులు పెట్టించిండు, కానీ దురదృష్టవశాత్తూ రనౌట్ అయిండు. ఆ తర్వాత గేర్ మార్చిన ధ్రువ్ జురెల్ (38) ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే క్రీజులో బాగా సెట్ అయిన తరుణంలో కార్బిన్ బోష్ బౌలింగ్‌లో జురెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డోనోవన్ ఫెరీరా (18) దీపక్ చాహర్ బౌలింగ్‌లో, శుభమ్ దూబే (5) శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో వరుసగా అవుట్ అవ్వడంతో రాజస్థాన్ 174 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయి మళ్లీ కష్టాల్లో పడింది.
జోఫ్రా ఆర్చర్, జడేజా విశ్వరూపం:
లాస్ట్‌ల టెయిలెండర్లు ముంబై బౌలర్లను తిప్పితిప్పికొట్టి స్కోరును రెండు వందల మార్కు దాటించిండ్రు. జోఫ్రా ఆర్చర్ బ్యాట్‌తో మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ క్రమంలో 32 రన్స్ బాదిన తర్వాత అవుట్ కావడంతో.. గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి దిగిండు. ఇక శార్దూల్ ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్లో జడ్డూ తన అసలు సిసలైన క్లాస్ చూపెట్టిండు. ఆ ఓవర్లో ఏకంగా 14 పరుగులు పిండుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ స్కోరు 205 పరుగుల మార్కును అందుకుంది. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
