రాజేంద్రనగర్ లో గుప్త నిధుల కోసం తవ్వకాలు.. 9 మంది అరెస్ట్ 

రాజేంద్రనగర్ లో గుప్త నిధుల కోసం తవ్వకాలు.. 9 మంది అరెస్ట్ 

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. బుద్వేల్ అంజనేయ స్వామి దేవాలయం సమీపంలో దుండగులు తవ్వకాలు జరిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్రనగర్ SOT పోలీసులు దాడులు చేశారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా తొమ్మిది మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి మూడు కార్లు, 16 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్ బస్తీలో రాజుల కాలానికి సంబంధించిన పురాతన కోట ఉంది. ఇక్కడ బస్తి అభివృద్ధి చెంది నివాస గృహాలు పెరగడంతో క్రమ క్రమంగా కోట గోడలు చాలావరకు కనుమరుగయ్యాయి. ఇప్పటికీ బుద్వేల్ బస్తీలో పలుచోట్ల కోట గోడలతో పాటు శిథిలావస్థలో ఉన్న బురుజులు కనిపిస్తాయి. కొన్నిచోట్ల కోట గోడలకు అనుకునే గృహాల నిర్మాణం చేపట్టారు. రాజుల కాలంలో నిర్మించిన పురాతనమైన కోట గోడకు అనుకుని ఉన్న ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. పాత మున్సిపల్ ఆఫీస్ సమీపంలో.. గవర్నమెంట్ స్కూల్ పక్కన ఉన్న ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.