జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుపై సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ఆయన స్వాగతిస్తూ.. ఈ నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇద్దరినీ పొగడ్తలతో ముంచెత్తారు. నరేంద్రమోడీ- అమిత్ షా ఇద్దరూ కృష్ణార్జునులని పొగిడారు రజినీకాంత్.
ఆదివారం నాడు చెన్నైలో ఓ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్ తన అభిప్రాయాన్ని తెలిపారు. “మిషన్ కశ్మీర్ పై హ్యాట్సాఫ్. మీకు కంగ్రాట్స్ చెప్పలేకుండా ఉండలేకపోతున్నా. మోడీ – అమిత్ షా ఇద్దరు కృష్ణార్జునుల లాంటివారు” అని అన్నారు రజినీకాంత్. ఆ వెంటనే… “ఇద్దరిలో కృష్ణుడెవరో.. అర్జునుడెవరో మాత్రం చెప్పలేను” అని చమత్కరించారు.
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ పార్టీ పెట్టబోతున్నానని ఇప్పటికే ప్రకటించారు రజినీకాంత్. తమిళనాడుకే చెందిన మరో సుప్రసిద్ధ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ మాత్రం ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించారు. అది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఆయన ఓ ప్రకనటలో స్పందించారు.