ఆయన ముందు సిగరెట్ తాగాలంటే భయపడేవాణ్ణి.. రజనీ కాంత్ ఎమోషనల్ కామెంట్స్

ఆయన ముందు సిగరెట్ తాగాలంటే భయపడేవాణ్ణి.. రజనీ కాంత్ ఎమోషనల్ కామెంట్స్

నటుడు, మిత్రుడు శరత్ బాబుకు సూపర్‌స్టార్ రజనీకాంత్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన శరత్ బాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శరత్ బాబుతో తనకు చాలా ఏళ్ల నుంచి మంచి అనుబంధం ఉందని రజనీ కాంత్ చెప్పారు. తనకు ధూమపానం మానేయమని అతనికి ఇచ్చిన సలహాను గుర్తు చేసుకున్నారు. ఆరోగ్యం విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకునేవారని అన్నారు.

శరత్‌బాబు తనకు నటుడిగా రాకముందే తెలుసని, తామిద్దరూ మంచి స్నేహితులని రజనీకాంత్ చెప్పారు. శరత్ బాబు మంచి మనిషి అని, మంచి స్నేహితుడు అని తెలిపారు. అతని ముఖంలో ఎప్పుడూ కోపం చూడలేదని, కేవలం చిరునవ్వే కనిపించేదని రజనీ కాంత్ అన్నారు. తాను అతనితో కలిసి ముల్లుమ్ మలరుమ్ , ముత్తు , అన్నామలై, వేలైక్కారన్ సినిమాలు చేశానని, అవన్నీ చాలా పెద్ద హిట్స్ అయ్యాయని చెప్పారు. ఆయనకు నాపై చాలా ప్రేమ, ఆప్యాయత ఉండేవన్న రజనీ.. తాను ఎప్పుడైనా పొగతాగుతూ కనిపిస్తే, అతను సిగరెట్ లాక్కొని ఆపేవాడన్నారు.. కాబట్టి, తాను అతని ముందు పొగతాగకుండా ఉండేవాడినని రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

శరత్ బాబు (71) అవయవ వైఫల్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 22న మరణించారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని చెన్నైకి తరలించారు. ఈ రోజు గిండిలో శరత్ బాబు అంత్యక్రియలు జరగనున్నట్టు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను నటి సుహాసిని పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది.

https://twitter.com/ANI/status/1660879630814056448