కండెక్టర్ గా పని చేసిన బస్సు డిపోకు వెళ్లిన రజినీకాంత్.. కార్మికులతో సెల్ఫీలు

కండెక్టర్ గా పని చేసిన బస్సు డిపోకు వెళ్లిన రజినీకాంత్.. కార్మికులతో సెల్ఫీలు

వాగని నోరు లేదు.. అరవని వీధి కుక్క లేదు.. ఈ రెండూ లేని ఊరు లేదు.. అర్థం అయ్యిందా రాజా.. ఈ లేటెస్ట్ డైలాగ్ చాలు.. రజినీకాంత్ అంటే ఏంటో చెప్పటానికి. తన జీవితం గురించి.. తను జీవితం ఎలా మొదలైంది అనేది చెప్పుకోవటానికి ఎప్పుడూ సిగ్గుపడని సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క రజినీకాంత్ మాత్రమే. కర్ణాటక రాష్ట్రం.. బెంగళూరులోని బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ అంటే.. మన ఆర్టీసీ లెక్క. ఇందులోనే మొదటగా బస్సు కండెక్టర్ గా పని చేశారు రజినీకాంత్. ఆ తర్వాతే సినిమాల్లోకి వెళ్లి సూపర్ స్టార్ అయ్యారు.

జైలర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కర్నాటక వెళ్లిన రజినీకాంత్.. 2023, ఆగస్ట్ 29వ తేదీ ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో.. బెంగళూరులోని బీఎంటీ బస్ డిపోకు వెళ్లారు. ఎలాంటి ముందస్తు ప్లానింగ్.. సమాచారం లేకుండా సడెన్ గా ఆ బస్సు డిపోలోకి వెళ్లారు. రజినీకాంత్ రాకతో డిపోలోని బస్సు డ్రైవర్లు, కండెక్టర్లు, ఇతర కార్మికులు షాక్ అయ్యారు. వాళ్లతో అర గంట పాటు ముచ్చటించారు రజినీకాంత్..

కార్మికులతో మాట్లాడిన సూపర్ స్టార్.. నా జీవితం ఇక్కడే మొదలైంది.. కండెక్టర్ గా ఈ డిపో నుంచే నా ప్రయాణం మొదలైంది. ఈ డిపోలోని బస్సులోనే కండెక్టర్ గా పని చేస్తూ.. సినిమాల్లోకి వెళ్లాను.. అందుకే ఈ బస్సు డిపో నాకు ఎప్పుడూ ప్రత్యేకం.. నా జీవితానికి అన్నీ ఇచ్చింది.. స్టార్ డమ్ ఇచ్చింది ఈ డిపోనే అంటూ బావోద్వేగానికి గురయ్యారు రజినీకాంత్.

బస్సు డిపోలోని ప్రతి ఒక్కరితో ముచ్చటించిన రజినీకాంత్.. అడిగిన వాళ్లందరికీ ఓపిగ్గా సెల్ఫీలు ఇచ్చారు. గత జ్ణాపకాలతో రజనీకాంత్ ఎమోషనల్ అయ్యారని కార్మికులు తెలిపారు. రజినీకాంత్ బస్సు డిపోకు వచ్చారన్న విషయం తెలుసుకున్న బయట అభిమానులు సైతం.. పెద్ద సంఖ్యలో డిపో దగ్గరకు తరలివచ్చారు