బ్యాక్ బెంచ్ టు పీహెచ్​డీ: ఇంటర్​లో 39% మార్కులు.. ఇంగ్లీష్ కూడా అంతంతే

బ్యాక్ బెంచ్ టు పీహెచ్​డీ: ఇంటర్​లో 39% మార్కులు.. ఇంగ్లీష్ కూడా అంతంతే

    అయినా ఐఐటీలో సీటు కొట్టాడు

    పల్లెటూరు నుంచి స్వీడన్ దాకా

    రాజస్థాన్ యువతకు స్ఫూర్తినిస్తున్న  రాజీవ్ దంతోదియా సక్సెస్

అతడికి ఇంటర్లో 39% మార్కులు. ఇంగ్లీష్​పెద్దగా రాదు. ఎగ్జామ్స్ అయిపోయిన మరుసటి రోజే.. దోస్తులతో కలిసి పుస్తకాలన్నీ అమ్మేసి క్రికెట్ బాల్స్ కొనుక్కుని గ్రౌండుకు ఉరికే రకం. ఇలాంటి ఓ సాధారణ బ్యాక్ బెంచ్ కుర్రాడి భవిష్యత్తు మామూలుగా అయితే సాదాసీదాగా గడిచిపోతుంది. కానీ.. అతడు తన కథను తానే మలుపు తిప్పుకున్నాడు.  ఐఐటీలో చదివి  స్వీడన్ దాకా పోయాడు. రాజస్థాన్​కు చెందిన 41 ఏళ్ల రాజీవ్ దంతోదియా కథ ఇది.

లైఫ్ ​ఇలా టర్న్ అయింది..

ధోల్​పూర్ సమీపంలోని సమోద్ అనే ఊరికి చెందిన రాజీవ్ తండ్రి ఓ చిన్న ఫ్యాక్టరీ ఓనర్​. రాజీవ్ చిన్నప్పటి నుంచే హిందీ మీడియంలో చదివాడు. ఇంగ్లీష్​ రానే రాదు.  ఎలాగోలా 12వ తరగతి (ఇంటర్​) దాకా చేరాడు.  39% మార్కులే వచ్చాయి. డిగ్రీలో సైన్స్ కోర్సులో చేరాలని ఆశపడ్డాడు. కానీ.. ఇతడికి వచ్చిన అత్తెసరు మార్కులకు ఆ కోర్సులో ఎక్కడా సీటు దొరకలేదు. దిగాలుపడి కూర్చున్న రాజీవ్​కు ఐఐటీ జేఈఈ ఫాం తెచ్చిచ్చాడు అతడి అన్న.  ఇంటర్ సబ్జెక్టుల్లోని బేసిక్స్ కూడా రాని అతడికి ‘ఈత రానోడు చెరువు మధ్యలోకి దుంకినట్లు’ అయిపోయింది పరిస్థితి. ఫైనల్ గా ఎగ్జాం రాశాడు. ఐఐటీలో సీటు కొట్టాలంటే.. ఏం చేయాలో తెలిసింది. ఓ కోచింగ్ సెంటర్​కు వెళితే ఇంటర్ మార్కులు చూసి వెనక్కి పంపేశారు. బుక్ సెంటర్​కు వెళ్లి వాళ్ల సలహాతో కొన్ని బుక్స్, హిందీ టు ఇంగ్లిష్​ డిక్షనరీ కొన్నాడు.

కోచింగ్ సెంటర్ మెటీరియల్ కూడా సంపాదించి ఇంట్లోనే చదవడం మొదలుపెట్టాడు.  2000వ సంవత్సరంలో ఐఐటీ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయ్యాడు. ఇంకా కష్టపడి చదివాడు. 2002లో ఐఐటీ ఖరగ్ పూర్ లో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కోర్సులో సీటు వచ్చింది. ఇక అప్పటి నుంచి రాజీవ్ దశ తిరిగిపోయింది. జాబ్​పై దృష్టి పెట్టకుండా పీహెచ్​డీ చేయాలనుకున్నాడు. ఐఐటీలో సెకండ్ ఇయర్​ చదువుతుండగానే లూలియా వర్సిటీలో పీహెచ్ డీకి అప్లై చేశాడు. చదువు అయిపోగానే అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు అక్కడే టెట్రా పాక్ కంపెనీలో సీనియర్ అనలిటిక్స్ రిలయబిలిటీ ఇంజనీర్​​గా సెటిల్ అయిపోయాడు.

సొంత మార్గంలోనే పోవాలి..

‘‘ఎవరైనా సరే వాళ్ల సొంత మార్గంలోనే పోవాలి. తప్పులు చేయాలి. వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఏం సాధించాలనుకున్నారో, దానిపై ఫోకస్ పెట్టాలి. సంకల్పంతో ముందుకెళ్లాలి. తప్పకుండా సక్సెస్ అవుతారు”

– రాజీవ్​ దంతోదియా

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి