
అచ్చంపేటలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ రైతు భరోసా దీక్ష నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ దీక్షకు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. దీక్షలో మాట్లాడిన రేవంత్ రెడ్డి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. దీక్షాస్థలి నుంచే కాంగ్రెస్ నేతలతో కలిసి పాదయాత్రకు బయల్దేరారు. రాజీవ్ రైతు భరోసా నినాదంతో పాదయాత్ర ప్రారంభించారు.
అంతకు ముందు రాజీవ్ రైతు దీక్షలో ప్రసంగించిన రేవంత్ .. రైతు వ్యవసాయం చేసేది దేశానికి పట్టెడన్నం పెట్టడానికేనని అన్నారు. భూస్వాముల నుంచి భూములను గుంజుకుని నిరుపేద రైతులకు భూపంపిణీ చేసి పట్టాలిచ్చింది ఇందిరాగాంధీ అని,రైతులను కాపాడటానికి మద్దతుధర ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారు చట్టాలు చేసిందని అన్నారు.
రైతులను బాగుచేయటానికి కాంగ్రెస్ చేసిన చట్టాలను రద్దు చేసి నేడు మోడీ సర్కారు కొత్త చట్టాలను రూపొందించిందని విమర్శించారు. ఆదాని, అంబానీల కోసం 80 కోట్ల మంది రైతుల ప్రయోజనాలను మోడీ తాకట్టుపెడుతున్నాడని, దానికి కేసీఆర్ సమర్థిస్తున్నాడని రేవంత్ అన్నారు. మోడీ తెచ్చిన చట్టాలను కేసీఆర్ అమలు చేస్తున్నాడన్నారు. రైతు పండించిన పంటకు ధర దళారి నిర్ణయిస్తున్నాడని, రైతుల పంట కొనలేనపుడు కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి ఎందుకు అని రేవంత్ ప్రశ్నించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతువ్యతిరేక విధానాలు ఫాలో అవుతున్నాయని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక ఎవరి ఆశలు నెరవేరలేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ఆస్తులు మాత్రం పెరిగాయని ఆరోపించారు. కేంద్రం తెచ్చింది వ్యవసాయ చట్టాలు కాదని, కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే చట్టాలని సీతక్క ధ్వజమెత్తారు.