
- రూ. 550 కోట్లకు అమ్మేందుకు కార్పొరేషన్ నిర్ణయం
- వారంలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్లోని రాజీవ్ స్వగృహ టవర్లను గంపగుత్తగా అమ్మేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 47 ఎకరాల్లో 17 టవర్లలో ట్రిపుల్ బీహెచ్ కే డీలక్స్, ట్రిపుల్ బెడ్ రూమ్, డబుల్, సింగిల్ బెడ్ రూమ్స్ అన్నీ కలిపి 2,856 ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులో 19 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. టవర్లు, ఖాళీ ల్యాండ్ను కలిపి మొత్తం రూ. 550 కోట్లకు అమ్మేందుకు నిర్ణయం తీసుకోగా ఈ వారంలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం.
ఫ్లాట్లను వేరుగా, ఖాళీ ల్యాండ్ ను వేరుగా అమ్మే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నారు. ఇందులో త్రిబీహెచ్ కే డీలక్స్ 840, త్రిబీహెచ్ కే ఫ్లాట్స్ 840, 2 బీహెచ్ కే 336, 1 బీహెచ్ కే 840 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ టౌన్ షిప్ కు వెళ్లేందుకు 100 ఫీట్ల రోడ్డును నిర్మించారు. ఇటీవల ఈ టవర్లను రూ.300 కోట్లకు ఓ కంపెనీ కొనేందుకు ముందుకు రాగా ప్రభుత్వం తిరస్కరించినట్లు తెలుస్తోంది.
ఇందిరమ్మ స్కీమ్కు ఫండ్స్..
రాష్ర్టవ్యాప్తంగా రాజీవ్ స్వగృహ టవర్లను, హౌసింగ్ బోర్డు ఖాళీ స్థలాలు, కమర్షియల్ ప్లేస్ లను గత ఏడాదిన్నర నుంచి వేలం వేస్తున్నారు. వీటి వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు నిధులు సమీకరిస్తున్నారు. కూకట్ పల్లిలో 7.8 ఎకరాల ల్యాండ్ ను రూ.547 కోట్లకు గోద్రెజ్ ప్రాపర్టీస్ కొనుగోలు చేసింది.
బండ్లగూడ, పోచారంలో ఖాళీగా ఉన్న ఫ్లాట్లను అమ్మగా, పోచారం, గాజుల రామారంలో ఉన్న టవర్లకు ఈ నెల 25న లాటరీ తీయనున్నారు. వీటితో పాటు ఖమ్మంలో ఉన్న టవర్లను వేలం వేయగా తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగులు రూ. 87.41 కోట్లకు కొనుగోలు చేశారు. ఇటీవల పోచారంలో మూడు టవర్లను వేలం వేయగా ఎన్టీపీసీ ఉద్యోగుల అసోసియేషన్, గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎఫ్ సీఐ ఉద్యోగుల అసోసియేషన్ కలిపి మొత్తం రూ.70.11 కోట్లకు కొనుగోలు చేశాయి.
హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలానికి నోటిఫికేషన్
మేడ్చల్ జిల్లా చింతల్ ,రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో కమర్షియల్ ప్లాట్ల వేలంకు హౌసింగ్ బోర్డు ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటి వేలంలో పాల్గొనే వాళ్లు వచ్చేనెల 8, 9 తేదీల్లో ఎంఎస్ టీఎస్ పోర్టల్లో రిజిస్ర్టేషన్ చేసుకొని, గజానికి రూ.2,500 ఫీజు చెల్లించాలని నోటిఫికేషన్ లో హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్ కోరారు. వచ్చే నెల 9,10 తేదీల్లో ఆన్ లైన్ లో వేలం వేయనున్నారు. మేడ్చల్ జిల్లా చింతల్ లో 2 ఎకరాల 25 గుంటల కమర్షియల్ ప్లాట్ కు గజం రూ.72 వేలు ఖరారు చేశారు. చింతల్ లోనే వేరే ప్రాంతంలో 3,388 గజాల కమర్షియల్ ప్లాట్ కు గజానికి రూ.60 వేలుగా ఖరారు చేశారు.