సిక్కిం బోర్డర్‌లో రాజ్‌నాధ్ దసరా సెలబ్రేషన్స్: సైనికులతో కలిసి ఆయుధ పూజ

సిక్కిం బోర్డర్‌లో రాజ్‌నాధ్ దసరా సెలబ్రేషన్స్: సైనికులతో కలిసి ఆయుధ పూజ

భారత్ – చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మన సైన్యంలో నైతిక స్థైర్యం నింపేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దసరా వేడుకలను బోర్డర్‌లో చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 23, 24 తేదీల్లో సిక్కిం సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంట పహారా కాస్తున్న జవాన్లతో కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. చైనా సరిహద్దుకు సమీపంలో వారితో కలిసి రాజ్‌నాథ్ ఆయుధ పూజ కూడా చేయనున్నారు. అలాగే ఈ పర్యటన సందర్భంగా సిక్కింలో పలు వ్యూహత్మక ప్రాంతాల్లోని బ్రిడ్జిలను ఆయన ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో 2017, 18 సంవత్సరాల్లో సిక్కింలోని డోక్లాం, నాథూ లా సెక్టార్లు తమవేనంటూ చైనా సైన్యం చొరబడే ప్రయత్నం చేసిన సమయంలో ఇరుదేశాల సైనికుల మధ్య పరస్పరం ఘర్షణలు జరిగి కొన్ని నెలల పాటు స్టాండాఫ్ నడిచింది. కొన్ని నెలల పాటు చర్చలు జరిగిన తర్వాత చైనా సైనికులు వెనక్కి వెళ్లారు. ఇప్పుడు లఢఖ్ సహా పలు ప్రాంతాల్లో చైనాతో బోర్డర్‌లో టెన్షన్స్ నడుస్తున్న వేళ భారత సైనికులకు మోరల్ సపోర్ట్‌గా రక్షణ మంత్రి సరిహద్దుల్లో పండుగ చేసుకునేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కాగా, గత ఏడాది ఫ్రాన్స్‌లో భారత్ రావాల్సిన రాఫెల్ యుద్ధ విమానాలకు రాజ్‌నాథ్ సింగ్ ఆయుధ పూజ చేసిన విషయం తెలిసిందే.