
- పాక్కు రక్షణ మంత్రి రాజ్ నాథ్ వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: దేశ సమైక్యత, సమగ్రత కాపాడేందుకు అవసరమైతే శత్రు దేశ సరిహద్దులు దాటి బుద్ధి చెప్తామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. 2016 లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, తాజా ఆపరేషన్ సిందూర్ తో ఆ విషయాన్ని నిరూపించామని చెప్పారు. శుక్రవారం జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన జీతో కనెక్ట్ సదస్సులో ఆయన మాట్లాడారు. పహల్గామ్ లో మతం పేరు అడిగి మరీ అమాయకులను ఉగ్రవాదులు చంపేశారని గుర్తు చేశారు. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రయిక్స్ సందర్భంగా తాము కేవలం టెర్రరిస్టులనే చంపామని తెలిపారు. అలాగే పహల్గామ్ దాడికి పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల శిబిరాలపై మాత్రమే ఎటాక్ చేశామన్నారు.
దేశ రక్షణ కోసమే మిలిటరీని బలోపేతం చేస్తున్నామని, అంతేతప్ప ఎవరి మీదో ప్రతీకారం తీర్చుకునేందుకు కాదన్నారు. దేశ రక్షణ ఎగుమతులను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాక ముందు రక్షణ శాఖ ఎగుమతులు రూ.600 కోట్లు ఉండేవని, ఇప్పుడు అది రూ.24 వేల కోట్లకు పెరిగిందని వెల్లడించారు. 2029 నాటికి ఆ ఎగుమతులు రూ.50 వేల కోట్లకు పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ శాఖ ఆయుధ సంపత్తి విషయంలో విదేశాలపై ఆధారపడడం తగ్గుతున్నదని చెప్పారు. ఇప్పటికే హిందుస్థాన్ ఎయిరో నాటికల్స్ ద్వారా 97 తేలికపాటి యుద్ధ విమానాలను కొనుగోలు చేశామన్నారు.