రజనీకాంత్ రాజకీయ పార్టీ గుర్తు ఆటో..?

రజనీకాంత్ రాజకీయ పార్టీ గుర్తు ఆటో..?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రకటన.. ఆ పార్టీ గుర్తు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈనెల 31న ఆయన రాజకీయ పార్టీని ప్రకటిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. రజనీకాంత్ ప్రయత్నాలు.. ఆయన చర్చిస్తున్న వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. అంతేకాదు.. ఆయన రాజకీయ పార్టీకి ఆటో గుర్తు కేటాయించినట్లు ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. రజనీకాంత్ పార్టీ పేరు మక్కల్ సేవై కచ్చి అని..  బలంగా ప్రచారం జరుగుతోంది. ఈ పార్టీకి ఆటో గుర్తును ఎన్నికల సంఘం కేటాయించడం తమిళనాట సంచలనం రేపుతోంది. రజనీకాంత్ మాస్ ఇమేజ్ ని ఆకాశానికి తీసుకెళ్లిన బాషా సినిమాలో.. ఆటో డ్రైవర్ గా నటించిన విషయం తెలిసిందే. సింప్లిసిటీకి పెద్దపీట వేసే రజనీకాంత్ ఆటోనే రాజకీయ గుర్తుగా ఎంపిక చేసుకుని ఉంటారని.. ఈ మేరకు ఎన్నిక సంఘానికి లేఖ పెట్టడం వల్ల అదే గుర్తును కేటాయించినట్లు ఊహాగానాలు జరుగుతున్నాయి. దాదాపు రెండేళ్ల క్రితమే రజనీకాంత్ కోసం ఈ పార్టీని నమదు చేసినట్లు తెలుస్తోంది. కరోనా లాక్డౌన్ తదితర కారణాలతో క్రియాశీల రాజకీయ కార్యకలాపాలకు రజనీకాంత్ కాస్త గ్యాప్ ఇచ్చారని చర్చ జరుగుతోంది.  ఓ వైపు కమలహసన్ రాజకీయ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తున్న నేపధ్యంలో తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు రజనీకాంత్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆటో గుర్తు కాదు..బాబా సినిమా గుర్తు

ఆటో గుర్తు కాదని.. అది వేరెవరో రిజిస్టర్ చేయించుకున్న రాజకీయ గుర్తని మరికొందరు కొట్టిపడేస్తున్నారు. రజనీకాంత్ రెగ్యులర్ గా బాబా సినిమాలో మాదిరిగా బొటన వేలితో రెండు మధ్య వేళ్లను ఒత్తిపట్టి.. చూపుడు వేలు.. చిటికెన వేలును ఎత్తి చూపే గుర్తే రజనీకాంత్ పార్టీ గుర్తు అని మరికొందరి వాదన. దీంతో ఆటో గుర్తుతోపాటు బాబా సినిమా గుర్తు పై కూడా రకరకాలుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. రజనీకాంత్ రెగ్యులర్ గా జనానికి.. మీడియాకు.. మరీ ముఖ్యంగా సినిమాల్లో సైతం తన మేనరిజంతో చిటికెన వేలుతోపాటు..  చూపుడు వేలును చూపే గుర్తే రాజకీయ పార్టీకి ఎంపిక చేస్తారన్న వాదన కు మద్దతుగా బలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో క్లారిటీ రావాలంటే.. రజనీకాంత్ స్వయంగా ప్రకటన చేయాల్సిందేనంటూ ఇరు వర్గాలే కాదు.. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.