అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని రావ్ జంటగా చైతు జొన్నలగడ్డ కీలకపాత్రలో సాయిలు కంపాటి తెరకెక్కించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ఒరిజినల్స్ సమర్పణలో రాహుల్ మోపిదేవితో కలిసి దర్శకుడు వేణు ఊడుగుల నిర్మిస్తున్నారు. నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. బుధవారం రిలీజ్ డేట్ వివరాలను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో బన్నీ వాస్ మాట్లాడుతూ ‘నా మనసుకు హత్తుకున్న చిత్రమిది. ప్రేక్షకులు ఎమోషనల్ ఫీల్‌తో థియేటర్ నుంచి బయటకు వస్తారు’ అని చెప్పారు.
నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ ‘ ఖమ్మం, వరంగల్ జిల్లాల మధ్య ఓ గ్రామంలో ప్రేమతో కూడిన ఓ విషాదభరితమైన సంఘటన జరిగి అక్కడే సమాధి అయ్యింది. దాని బేస్ చేసుకుని ఎంటర్‌టైన్మెంట్, మాస్ అప్పీల్ ఉండేలా సాయిలు ఈ స్క్రిప్ట్ రాశాడు. కథ విన్నప్పుడే హృదయాన్ని కదిలించింది. ప్రేమిస్తే, బేబి తరహాలో మెప్పిస్తుంది’ అని అన్నారు. ‘తెలంగాణ నేటివిటీని ఇక్కడి ప్రజల జీవితాలను ఇంత పర్ఫెక్ట్ గా చూపించిన సినిమా మరొకటి లేదు. ఎమోషన్, ఎంటర్ టైన్మెంట్‌తో ఆకట్టుకుంటుంది’ అని నటుడు చైతు జొన్నలగడ్డ చెప్పాడు.
సినిమా చూస్తున్నప్పుడు ఓ ఎమోషన్‌కు గురవుతారని, తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని హీరోహీరోయిన్స్ తెలిపారు. డైరెక్టర్ సాయిలు కంపాటి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, నిర్మాత వంశీ నందిపాటి, ఈటీవీ విన్ ప్రతినిధులు నితిన్, సాయికృష్ణ పాల్గొన్నారు.
