ఆలయ ప్రారంభానికి చినజీయర్ ను పిలవకపోవడం బాధాకరం

ఆలయ ప్రారంభానికి చినజీయర్ ను పిలవకపోవడం బాధాకరం

యాదగిరిగుట్ట ఆలయ ప్రారంభోత్సవానికి చినజీయర్ స్వామిని పిలవకపోవడం బాధాకరమని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. రాజకీయాలను దేవుడితో ముడిపెట్టడం భావ్యం కాదన్నారు. గవర్నర్ ను కూడా కేసీఆర్ ప్రభుత్వం అవమానించడం సరికాదని వ్యాఖ్యానించారు. యూపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన నేపథ్యంలో ఆదివారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. యాదగిరిగుట్ట ఆలయ శిలలపై కేసీఆర్ ఫొటో, టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు ఫొటోలను చెక్కినప్పుడు కూడా బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించిందని లక్ష్మణ్ గుర్తుచేశారు. ప్రపంచం అబ్బురపడేలా ఆలయాన్ని నిర్మించామని చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం.. భక్తులకు కనీస సదుపాయాలను కల్పించలేకపోయిందని ఆరోపించారు. ఆలయ ప్రాంగణంలో నిల్చోడానికి నీడ కూడా లేదన్నారు. మండుతున్న ఎండలకు భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన చెప్పారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపించకుండా, ఆటోలను కొండపైకి నిషేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తనను రాజ్యసభకు పంపడం ద్వారా, పార్టీలో నిబద్ధతతో పనిచేస్తే పదవులు వాటంతటవే వస్తాయనే సందేశాన్ని ప్రధాని మోదీ మరోసారి ఇచ్చారని పేర్కొన్నారు. రాజ్యసభకు పంపుతూ తనకిచ్చిన గౌరవం పార్టీ కార్యకర్తలకు అంకితమన్నారు. ప్రజల గొంతును రాజ్యసభలో వినిపిస్తానని లక్ష్మణ్ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు..

జూబ్లిహిల్స్ పబ్ కేసులో మరో నిందితుడి అరెస్ట్

మైనర్ అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్