రాజ్భవన్ లో ఎట్ హోం.. హాజరైన ప్రముఖులు

రాజ్భవన్ లో ఎట్ హోం.. హాజరైన ప్రముఖులు

హైదరాబాద్: రాజ్ భవన్ ఎట్ హోం విందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్ తమిళి సై  సౌందరరాజన్ రాజ్ భవన్ లో ‘ఎట్ హోం’ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు,  ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. రాజ్ భవన్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు గవర్నర్ తమిళిసైతోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. గవర్నర్ ఇచ్చిన విందుకు పార్టీలకు అతీతంగా హాజరైన నేతలు సరదాగా మాట్లాడుకున్నారు. 

శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా వచ్చి కిషన్ రెడ్డి పక్కన ఆసీనులై మాటా మంతీ జరుపుకోగా.. కొద్దిసేపటికే రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు మరోచోట ఆశీనులయ్యారు. 

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎట్ హోం విందుకు హాజరై మంత్రులు ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలతో మాట్లాడారు. ఇతర మంత్రులను కూడా నవ్వుతూ పలకరించారు. మంత్రుల వద్దకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లి మాట్లాడుతుండడం అందరి దృష్టిని ఆకర్షించింది. 

తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తోపాటు పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలు హాజరుకాగా.. చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, ఇతర సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. 

బండి సంజయ్.. రేవంత్ రెడ్డి ముచ్చట్లు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒకేచోట కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్లిన దృశ్యం అందరినీ ఆకర్షించింది. పార్టీల పరంగా పరస్పరం విభేదించుకుంటూ.. విమర్శకు ప్రతివిమర్శలతో రాజకీయ వేడి పుట్టించే ఈ నాయకులు సాధారణ వ్యక్తుల్లానే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడపడం కనిపించింది.