ట్రావెన్ కోర్ తరఫున వాదనలు వినిపించిది ఈయనే

ట్రావెన్ కోర్ తరఫున వాదనలు వినిపించిది ఈయనే

ఒక తీర్పు.. సంప్రదాయానికి సమానత్వానికి… భక్తుల మనోభావాలకు, మహిళా హక్కుల పోరాటాలకు మధ్య సంఘర్షణకు దారి తీసింది. ఆ ఒక్క తీర్పుతో దేశ వ్యప్తంగా హిందూ సంఘాల నిరసనలకు తెరలేపింది. పరస్పర రాజకీయ ఆరోపణలకు కారణమైంది. అదే శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించొచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు.

గత ఏడాది సెప్టెంబరు 28న ఆ తీర్పు వచ్చిన నాటి నుంచి హిందూ సంఘాలు, అయ్యప్ప భక్తులు నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. వెల్లువలా రివ్యూ పిటిషన్లు సుప్రీం కోర్టు తలుపు తట్టాయి. 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై నిషేధాన్ని పునరుద్ధరించి అయ్యప్ప ఆలయ పవిత్రతను కాపాడాలని వేడుకోలు వచ్చాయి.

ఇన్నాళ్లకు ఆ రివ్యూ పిటిషన్లను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారించింది. అయ్యప్ప భక్తులతో పాటు దేశమంతా లాయర్ల ఏం వాదనలు వినిపిస్తారు..? న్యాయమూర్తులు ఏం తీర్పు ఇస్తారని ఉత్కంఠగా చూసింది.

ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్టు.. ఆలయ నిర్వహణ చూసే ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డే వైట్ క్లాత్ చూపించింది. గతంలో నిషేధాన్ని సమర్థించిన బోర్డు ఇప్పడు నో అబ్జెక్షన్ అని చెప్పింది. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించేందుకు తమకు అభ్యంతరం లేదని బోర్డు తరఫు న్యాయ వాది చెప్పారు. సుప్రీం గతంలో ఇచ్చిన తీర్పునే అమలు చేస్తామని తెలిపారు. అయ్యప్ప భక్త సంఘాల తరఫున పిటిషన్లు వేసిన వారు మాత్రం నిషేధం కొనసాగించాల్సిందేనని వాదించారు. అన్నీ విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది.

ఆలయమే యూటర్న్ తీసుకోవడంపై భక్తులు ఒక్కింత షాకయ్యారు. మరి బోర్డు తరఫున వాదనలు వినిపించిన లాయర్ ఎవరన్న ఆసక్తి వారికి కలగకమానదు.

ఆ లాయర్ ఈయనే..

ఇదిగో ఆయన పేరు… రాకేశ్ ద్వివేది.. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవ్చని ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు తరఫున వాదనలు వినిపించిన సుప్రీం కోర్టు సీనియర్ లాయర్. వాదనలు పూర్తయ్యాక మీడియాతో మాట్లాడుతూ బోర్డు సుదీర్ఘ ఆలోచన తర్వాత సుప్రీం తీర్పును గౌరవించాలని నిర్ణయించుకుందన్నారు. దేవుడిని పూజించడంలో మహిళలకు సమానత్వం ఉండాలన్న ఆ తీర్పు సరైన నిర్ణయమని బోర్డు భావిస్తోందని చెప్పారు.

యూపీకి చెందిన రాకేశ్ ద్వివేది సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాది. ఆయన సివిల్, రాజ్యంగ పరమైన కేసుల వాదనలో దిట్ట. ఆయన తండ్రి ఎస్ఎన్ ద్వివేది సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి. రాకేశ్ కు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వారిలో ఒకరు సుప్రీం కోర్టులోనే సీనియర్ అడ్వొకేట్ గా ఉండగా.. మరొకరు డాక్టర్.

యూపీలోని అలహాబాద్ హైకోర్టు, లక్నో బెంచిల్లో ఆయన లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. న్యాయశాస్త్రంలో తన మెరిట్ తో సీనియర్ అడ్వొకేట్ గా సుప్రీంలో అడుగుపెట్టారు.

ఎటువంటి కేసు అయినా ఆయన పీస్ ఫుల్ గా వాదనలు వినిపిస్తారని పేరు. నవ్వు చెరగకుండా కోర్టు హాలులో ఉండే మనిషని తోటి అడ్వొకేట్లు మెచ్చుకుంటారు. ఆయనకు లాయర్ గా 30ఏళ్ల అనుభవం ఉంది.

కావేరీ జలాల కేసు, రాజీవ్ హత్య కేసు, చెరకు రైతుల ఆత్మహత్య కేసు, జయలలిత డిఫమేషన్ కేసు సహా పలు ప్రతిష్టాత్మక కేసుల్లో ఆయన వాదనలు వినిపించారు.