ఆర్టీసీకి రాఖీ ధమాకా..కరీంనగర్ రీజియన్ లో ఐదు రోజుల్లో రూ.15.48 కోట్ల ఆదాయం

ఆర్టీసీకి రాఖీ ధమాకా..కరీంనగర్ రీజియన్ లో ఐదు రోజుల్లో రూ.15.48 కోట్ల ఆదాయం
  •  29 లక్షల మంది ప్రయాణం
  •  వీరిలో 21.21 లక్షల మంది మహాలక్ష్మిలే

కరీంనగర్, వెలుగు: టీజీఆర్టీసీ కరీంనగర్ రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాఖీ పండుగ కలిసొచ్చింది. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఐదు రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11 డిపోల్లో 29.10 లక్షల మంది ప్రయాణించగా.. రూ.15.48 కోట్ల ఆదాయం సమకూరింది. బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించడంతో ఆక్యుపెన్సీ రేటు(ఓఆర్)  112 శాతంగా నమోదైంది. మొత్తం ప్రయాణికుల్లో 21.21 లక్షల మంది మహాలక్ష్మి ప్రయాణికులే ఉండడం విశేషం. 

కరీంనగర్ 2 డిపోకు అత్యధిక ఆదాయం

కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో అత్యధికంగా కరీంనగర్ - 2 డిపోకు రూ.2.41 కోట్లు, గోదావరిఖనికి రూ.2.23 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత జగిత్యాలకు రూ.1.78 కోట్లు, కరీంనగర్ - 1కు రూ.1.59 కోట్లు, హుజూరాబాద్, సిరిసిల్ల డిపోలకు రూ.1.17 కోట్ల చొప్పున, వేములవాడ, కోరుట్ల డిపోలకు రూ.1.14 కోట్ల చొప్పున, మెట్ పల్లికి 1.07 కోట్లు, హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.87 లక్షలు, మంథనికి రూ.85 లక్షల ఆదాయం 
సమకూరింది.  

73 శాతం మంది మహాలక్ష్మీలే.. 

 తమ తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు ఈ ఐదు రోజుల్లో మహిళలు, బాలికలే ఎక్కువగా ప్రయాణించినట్లు టికెట్ల లెక్కలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 29,10, 435 మంది ప్రయాణిస్తే.. 21,21,668 మంది(73 శాతం) మహాలక్ష్మి ప్రయాణికులే ఉన్నారు. గోదావరిఖని డిపో బస్సుల్లో 4,28,423 మంది ప్రయాణించగా.. జగిత్యాల డిపో పరిధిలో 3,67,855 మంది, కరీంనగర్ -1 డిపో బస్సుల్లో 2,93,176 మంది, కోరుట్ల, హుజూరాబాద్, కోరుట్ల డిపోల బస్సుల్లో 24 లక్షల మంది చొప్పున  ప్రయాణించారు. హుజూరాబాద్ డిపో బస్సుల్లో అత్యధికంగా 140 ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది.

ఆ తర్వాత మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లికి 123, సిరిసిల్లకు 122, కోరుట్ల 119, గోదావరిఖని 118, హుస్నాబాద్, వేములవాడ 115 చొప్పున ఓఆర్ నమోదైంది.  గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు అధిక సంఖ్యలో బస్సులు నడిపించడంతో ఆదాయం పెరిగింది. రీజియన్ లో ఉన్న బస్సులన్నింటినీ రోడ్డెక్కించారు. రాఖీ పండుగ రోజు మహిళా కండక్టర్లు కూడా విధుల్లో ఉండడం విశేషం. కాగా రాఖీ సందర్భంగా ప్రయాణికుల చేరవేతలో హుజూరాబాద్ డిపో ఆదాయంలో రెండో స్థానంలో నిలిచిందని డీఎం రవీంద్రనాథ్ తెలిపారు. 31 వేల కిలోమీటర్లు తిరిగితే రూ.31లక్షల ఆదాయం వచ్చింది.