తెలంగాణకు తోబుట్టువును : గవర్నర్ తమిళిసై

తెలంగాణకు తోబుట్టువును : గవర్నర్ తమిళిసై

హైదరాబాద్ : తెలంగాణకు తాను తోబుట్టువునని చెప్పారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్. రాజ్ భవన్ లో తాను బుధవారం రోజు (ఆగస్టు 30న) రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ కడుతున్నానని చెప్పారు. తెలంగాణ రాజ్ భవన్ లో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాఖీ ఫర్ సోల్జర్స్ అనే పేరుతో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. సంస్కృతి ఫౌండేషన్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ ఫర్ సోల్జర్స్ కార్యక్రమంలో ఆర్మీ ఫోర్స్ సోల్జర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. 

రాజ్ భవన్ లో నిర్వహించిన రాఖీ ఫర్ సోల్జర్స్ ఎంతో ముఖ్యమైన కార్యక్రమం అన్నారు గవర్నర్ తమిళిసై. తెలంగాణ రెడ్ క్రాస్ ను చూస్తే ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. దేశంలో ఎన్నో సంస్కృతులు.. మరెన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరం కలిసి మెలిసి ఉంటున్నామని చెప్పారు. అన్నాచెళ్లెల్ల అనుబంధం ఎంతో ఆత్మీయమైందని చెప్పారు.

సంస్కృతి ఫౌండేషన్, ఆర్మీ వారికి కృతజ్ఞతలు తెలిపారు గవర్నర్ తమిళి సై. భారత సైనికుల వల్లే ఇవాళ దేశ ప్రజలందరూ హ్యాపీగా ఉంటున్నారని తెలిపారు. దేశం సురక్షితంగా ఉండటానికి కారణమైన భారత సైనికుల గురించి స్కూలు పిల్లలు తెలుసుకోవాలని సూచించారు. రాఖీ కట్టి వారికి మనమందరం కృతజ్ఞతలు తెలుపుకుందామన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.