
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూన్ 20వ తేదీ మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు ఓ ప్రకటనను రిలీజ్ చేశాయి. దీంతో మెగాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రామ్ చరణ్, ఉపాసనలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు తల్లిదండ్రులుగా మారడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. జూన్ 19వ తేదీ సోమవారం ఉపాసన అపోలో ఆసుపత్రిలో కనిపించింది. దీంతో ఆమె డెలివరీ కోసమే హాస్పిటల్‌లో చేరినట్లు ప్రచారం మొదలైంది. ఆమె వెంట రామ్‌చరణ్‌తో పాటు శోభన కామినేని, సురేఖ కొణిదెల కనిపించారు. ఈ వార్తలను నిజం చేస్తూ జూన్ 20వ తేదీ మంగళవారం ఉదయం గుడ్‌న్యూస్ వినిపించారు. ఉపాసన ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు కామినేని కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రికి సందర్శిస్తున్నారు. తమ కుటుంబంలోకి అడుగుపెట్టిన కొత్త ఫ్యామిలీ మెంబర్‌ను ఆశీర్వదిస్తున్నారు.
రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి జూన్ 14, 2012న హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. పెళ్లైన పదకొండేళ్ల తర్వాత తల్లిదండ్రులుగా మారారు. ఉపాసన అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు, శోభన, అనిల్ కామినేనిల కూతురు. ప్రస్తుతం ఉపాసన అపోలో చారిటీకి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు.