హాలీవుడ్‌ సినిమా చేస్తే అలాంటి కండిషన్లు పెడ్త : రామ్ చరణ్

 హాలీవుడ్‌ సినిమా చేస్తే అలాంటి కండిషన్లు పెడ్త : రామ్ చరణ్


తాను హాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తే ఇండియాలోనే షూటింగ్ లు చేయాలని మేకర్స్ కు కండిషన్లు పెడతానని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్నారు.  ఇండియాలో  నార్త్‌, సౌత్‌ అంటూ రెండు రకాల సినిమాలు లేవన్న చరణ్.. ఉన్నది ఇండియన్ సినిమా ఒక్కటేనని,  ఇప్పుడది గ్లోబల్‌ స్థాయిలో గుర్తింపు పొందిందని చెప్పుకొచ్చాడు.   జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న జీ20 సదస్సుకు రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు కశ్మీరీ తలపాగా చుట్టారు. ఆ వేదికపై రామ్ చరణ్ తన సూపర్ డూపర్ హిట్ సాంగ్, ఆస్కార్ అందుకున్న నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. ఈ సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి... రామ్ చరణ్ కు శాలువా కప్పి, జ్ఞాపికను  అందజేసి సన్మానించారు.  

ఇండియాలో ఎంతో అందమైన లొకేషన్లు ఉన్నాయని.. కశ్మీర్ లాంటి ప్రాంతంలో ఈ సదస్సును పెట్టడం చాలా సంతోషంగా ఉందని రామ్ చరణ్ అన్నారు. ఇండియాలో కేరళ, కశ్మీర్ తో పాటుగా చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయని తాను నటించిన చిత్రాల షూటింగ్ ఎక్కువగా ఇండియాలోనే జరపాలని కోరుకుంటున్నా్నని రామ్ చరణ్ తెలిపారు. ప్యూచర్ లో  హాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తే ఇండియాలోనే ఎక్కువ శాతం షూటింగ్ జరపాలనే కండిషన్ పెడతానని అన్నాడు.  

ఇక ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవిని ప్రశంసలతో ముంచెత్తాడు.  తనకు తన తండ్రే స్ఫూర్తి అని తెలిపాడు.  ఆయన్ను చూసి చాలా నేర్చుకున్నానని అన్నాడు. ప్రస్తుతం తన తండ్రికి 68 ఏళ్లని, ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారని తెలిపారు. అంత గొప్ప హీరో అయినప్పటికీ ఉదయాన్నే 5.30 కు నిద్రలేచి పనిలో మునిగిపోతారు. ఆయనకు సినిమాలపై ఉన్న నిబద్ధత అలాంటిదని చరణ్ చెప్పుకొచ్చాడు.