Chiranjeevi: రామ్‌ చరణ్‌ కంటికి సర్జరీ... క్లారిటీ ఇచ్చిన చిరంజీవి.!

Chiranjeevi: రామ్‌ చరణ్‌ కంటికి సర్జరీ... క్లారిటీ ఇచ్చిన చిరంజీవి.!

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'పెద్ది' (Peddi) చిత్ర షూటింగ్‌లో  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గాయపడ్డారు. 25 మార్చి2026న జరిగిన ఈ ఘటనలో చరణ్ కంటి వద్ద గాయం అయింది.  దీంతో మెగా అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే, ఆయనకు జరిగిన గాయంపై చిత్ర యూనిట్,  స్వయంగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ లేటెస్ట్ అప్‌డేట్స్ అందించారు.

షూటింగ్‌లో అసలేం జరిగింది?

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో 'పెద్ది' చిత్రానికి సంబంధించి ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఒక రిస్కీ స్టంట్‌లో రామ్ చరణ్ ఎడమ కనురెప్పకు గాయమైంది. మొదట ఇది చిన్న స్క్రాచ్ అని భావించినప్పటికీ, కంటి భాగం కావడంతో ఎటువంటి రిస్క్ తీసుకోకూడదని వైద్యులు చిన్నపాటి సర్జరీని చేశారు. ప్రస్తుతం చరణ్  విశ్రాంతి తీసుకుంటున్నారు.

వైద్యులకు కృతజ్ఞతలు

చరణ్ ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌ వేదికగా స్పందించారు. అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చరణ్ కనురెప్పకు సరైన సమయంలో, ఎంతో నైపుణ్యంతో సర్జరీ చేశారు. ఆ సమయంలో మాకు కలిగిన ఆందోళనను మీ నైపుణ్యం, జాగ్రత్త పూర్తిగా పోగొట్టాయి. మీ పనితనం నిజంగా అద్భుతం అంటూ చిరంజీవి భావోద్వేగంతో పోస్ట్ చేశారు. చరణ్ భార్య ఉపాసన కూడా వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

 

భారీ అంచనాలతో..

రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఇది ఒక విలేజ్ స్పోర్ట్స్ డ్రామా. ఇందులో చరణ్ ఒక రస్టిక్ లుక్‌లో, విజయనగరం యాసలో మాట్లాడుతూ కనిపిస్తారు. క్రికెట్, కుస్తీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'చికిరి చికిరి' సాంగ్ రికార్డులు సృష్టిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తిరిగి సెట్స్‌లోకి..

ఏపీ ఉప ముఖ్యమంత్రి, బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచన మేరకు చరణ్ ప్రస్తుతం రెండు రోజుల విశ్రాంతిలో ఉన్నారు. ఈ చిన్న విరామం తర్వాత ఆయన మళ్లీ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ నెల 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'పెద్ది' నుంచి 'కుస్తీ' పేరుతో టీజర్ వచ్చే అవకాశం ఉండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.