
రాజమౌళితో సినిమా చేస్తున్నప్పుడు మరో సినిమా గురించి ఆలోచించే టైమే ఉండదనేది ఇండస్ట్రీ మాట. అందుకే తారక్, చెర్రీలిద్దరూ వేరే సినిమా చేయట్లేదు. కానీ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఓకే చేసి పెట్టుకున్నారని సమాచారం. జక్కన్నతో సినిమా అయ్యాక ఎన్టీయార్.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటిస్తాడనే వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. మరోపక్క రామ్‌చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా టాక్ నడుస్తోంది. ఈ చిత్రం పూర్తయ్యాక శివ నిర్వాణ డైరెక్షన్‌లో చెర్రీ సినిమా ఉంటుందని మొదట అన్నారు. అయితే ఇప్పుడు టాక్ మారింది. ‘సాహో’ ఫేమ్ సుజిత్‌కి తన తర్వాతి సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ ఇచ్చాడట చెర్రీ. ఇటీవలే సుజిత్ అతనిని కలిసి కథ చెప్పాడని, నచ్చడంతో చరణ్ ఓకే అన్నాడని, యువీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని, అన్నీ అనుకున్నట్టు జరిగితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ పూర్తయ్యీ అవ్వగానే సెట్స్‌కి వెళ్తుందని బలంగా వినిపిస్తోంది. ‘సాహో’ సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించిందేమో కానీ టాక్ పరంగా నిరాశపర్చింది. దానికి కారణం కథ, కథనాలే అని అందరూ అనడంతో సుజిత్‌పై ఆ ఎఫెక్ట్ పడి ఉంటుందని, అందుకే అతడింత వరకు మరో ప్రాజెక్టును అనౌన్స్ చేయలేదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. కానీ అతడు సైలెంట్‌గా చెర్రీతో ప్రాజెక్ట్ చేస్తున్నాడని ఇప్పుడు అంటున్నారు. ఇది నిజమో కాదో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తే గానీ తెలియదు మరి.